బాహుబలి విడుదలకు ముందే భయంకరమైన బిజినెస్ చేసిన ఓ తెలుగు సినిమా. ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా బాలీవుడ్ తోసహా అన్ని భాషల్లో ఫ్రీ పబ్లిసిటి మూటగట్టుకున్న సినిమా ఇదే కాబోలు. ప్రింట్, వెబ్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో కూడా విపరీతమైన ప్రచారంతో జూలై 10 న విడుదల అయ్యేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. తెలుగు రాష్ట్రాలలో బెనిఫిట్ షోలకు కూడా రంగం సిద్ధమైపోతోంది. . అంతేకాదు గతంలో ఏ సినిమాకు లేనంతంగా రెండు రాష్ట్రాలలో దాదాపు 95 శాతం ఆక్యూపెన్సీతో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఇక 9 అర్థరాత్రి నుంచే హంగామా చేసేందుకు ఫ్యాన్స్ రెడీ అయిపోతున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ భ్రమరాంభ థియేటర్లో బెనిఫిట్ షో నిర్వహాణ బాధ్యతలను నెత్తిన వేసుకున్నాడు రాజమౌళి తనయుడు కార్తికేయ. ఈ బెనిఫిట్ షో ద్వారా వచ్చే డబ్బును ఓ చారిటీకి విరాళంగా ఇచ్చేందుకు సిద్ధమయ్యాడట. అంతేకాదు ఈ షోకి రాజమౌళి కుటుంబ సభ్యులంతా హాజరవుతారని తెలుస్తోంది. ఇక ఈ బెనిఫిట్ షోలకు కనివిని ఎరుగని రీతిలో 5,000 నుంచి 6,000 రూపాయల మధ్య అమ్ముతున్నట్లు సమాచారం. అన్నట్లు కార్తికేయ గతంలో ఎన్టీఆర్ టెంపర్ చిత్రానికి కూడా బెనిఫిట్ షో నిర్వహించి ఆ డబ్బును ఓ అనాథాశ్రమానికి విరాళంగా ఇచ్చాడు.