వైలెంట్... హారర్ సినిమాలు తీసి తీసి బోర్ కొట్టేసిందేమో ఈ సంచలన దర్శకునికి. ఎప్పుడూ వెరైటీ మాటలతో వివాదాల్లో తలదూరుస్తూ, తన సినిమాలు కూడా వెరైటీగా తీస్తూ ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగా కనిపించే రాంగోపాల్ వర్మకు మరో వెరైటీ ఆలోచన వచ్చేసింది. తన చిత్రాల్లో కొత్త ప్రయోగాలు చేసి చూపించే ఈయన ఇప్పడు ఒకేసారిగా గప్ చుప్ అనేస్తున్నారు అంటే ఓ సైలెంట్ మూవీ తీస్తున్నారట. ఈ సినిమా పేరు కూడా ‘సైలెంట్’ అని పెట్టుకున్నారు. మరి ఈ సినిమా విశేషాలేంటంటే... సినిమా అంటేనే దృశ్యశ్రవణ సమ్మేళనం. కానీ మొదట వచ్చిన సినిమాల్లో ‘దృశ్యం’ మాత్రమే కనిపించేది... ఆ తరువాత శబ్ధం తోడయ్యింది. ‘సైలెంట్ మూవీస్’ అంతరించిపోయిన 50 సంవత్సరాల తర్వాత.. 1976లో ‘మెల్ బ్రూక్స్’ అనే హాలీవుడ్ దర్శకుడు ‘సైలెంట్ మూవీ’ పేరుతో ఓ సైలెంట్ చిత్రాన్ని తీసి పెద్ద హిట్ చేసాడు. అలాగే మన తెలుగులోనూ సింగీతం శ్రీనివాసరావు మూకీ శకం ముగిసిన 60 ఏళ్ల తర్వాత ‘పుష్పక విమానం’ తీసి విజయం సాధించారు.. వీటన్నిటిని స్ఫూర్తిగా తీసుకుని రాంగోపాల్ వర్మ క్రైమ్ కామెడి జోనర్‌లో ఒక మూకీ సినిమా తీయబోతున్నాననీ, ఆ సినిమా పేరు ‘సైలెంట్’ అని చెప్పారు. ఇక దీన్ని డబ్బింగ్ లేకుండా అన్ని భాషల్లో విడుదల చేయచ్చు కదా... ఆర్టిస్టులకు మళ్ళీ డబ్బింగ్ చెప్పుకునే బాధ కూడా ఉండదు. ఇప్పుడొచ్చే సినిమాలన్నీ రణగొణ ధ్వనులే కదా.... మరి ఈ సైలెంట్ నూ ఎంజాయ్ చేద్దాం.