ప్రక్రుతి వైపరీత్యాల సమయంలో బాధితులకు అండంగా నిలిచేందుకు ముందుండే సినీ నటులు ఈ మధ్య వినూత్న రీతిలో వారికి సహాయం అందిస్తున్నారు. తాజాగా జమ్ము కాశ్మీర్, అసోం రాష్ట్రాలను కొన్ని నెలల కిందట భీకర వరదలు ముంచెత్తాయి. ఆ రాష్ట్రాల వరద బాధితుల సహాయార్థం, అక్కడి అభివృద్ధికి తమవంతు నిధులను సేకరించేందుకు బాలీవుడ్ నటులు రణబీర్ కపూర్, అనుష్క శర్మ ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో, 'రాక్ స్టార్' చిత్రంలో రణబీర్ ధరించిన కాశ్మీరీ ఫెరాన్, 'జబ్ తక్ హే జాన్'లో అనుష్క వేసుకున్న లెదర్ జాకెట్ ను ఆన్ లైన్ సంస్థ 'ఈబే' ద్వారా వేలానికి పెట్టారు. గురువారం నుంచి మొదలైన ఈ వేలం ఈనెల 13 వరకు జరుగుతుంది. ఇలా అభిమానులు తాము ఇష్టపడే నటీనటులు ధరించిన దుస్తులను కొనుగోలు చేయవచ్చు. వేలం ద్వారా వచ్చిన నగదును రెండు రాష్ట్రాల వరద బాధితుల సహాయార్థం అందజేస్తారు. ప్రస్తుతం రణబీర్, అనుష్కలు 'బాంబే వెల్వెట్' చిత్రంలో నటిస్తున్నారు.