మెస్మరైజింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఓ సొంత చిత్రం నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని అంశాలు కొత్తగా తెలియజేశారు. ఈ సినిమాలో అందరూ కొత్తవారే నటిస్తున్నారట. అలాగే ఈ చిత్రానికి విశ్వేష్ కృష్ణమూర్తి అనే ప్రముఖ రంగస్థల నటుడు, నృత్య కళాకారుడు దర్శకత్వం వహిస్తున్నారు. సంగీత ప్రధానంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని హిందీ, తమిళం భాషలలో ఏకకాలంలో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి హిందీలో ‘99 సాంగ్స్’ అని, తమిళంలో ‘99 పాడల్ గళ్’ అనే టైటిల్ ను నిర్ణయించారు. ఈ సినిమా కోసం ఇప్పటికే రెహమాన్ ఐదు పాటల కంపోజింగ్ పూర్తి చేసారట. మిగిలిన 5 పాటలను అతి త్వరలోనే పూర్తి చేసి, షూటింగ్ ప్రారంభించనున్నారని తెలిసింది. ఈ చిత్రాన్ని ఏఆర్ రెహమాన్ తన సొంత బ్యానరైన ఏఆర్ రెహమాన్ వైఎంసీ బ్యానర్లో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నప్పటికీ భవిష్యత్తులో మాత్రం తన బ్యానర్లో వచ్చే చిత్రాలకు కొత్త సంగీత దర్శకులకు కూడా అవకాశం ఇవ్వనున్నట్టు తెలిసింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరికొన్ని వివరాలు ప్రకటించనున్నారు.