బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కేసును మరో కొత్త మలుపు తిప్పేస్తున్నారు ఆయన తరఫు లాయర్లు. ఆయన యాక్సిడెంట్ వ్యవహారం చివరి దశకు చేరుతున్న సమయంలో ఆయన లాయర్లు మరో కొత్త వాదన వినిపిస్తున్నారు. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తులు కారు తమపైనుంచి దూసుకుపోయిందని ఇచ్చిన ఫిర్యాదులో వాస్తవం లేదని, ప్రమాదానికి గురైన కారును పోలీసులు తెచ్చిన క్రేన్‌తో పైకి లేపుతుండగా పట్టుతప్పి వారిపై పడిందని డిఫెన్స్ లాయర్ శ్రీకాంత్ షివేదీ కోర్టుకు తెలిపారు. సాక్షుల వాంగ్మూలాలను చదువుతూ బాధితుల దుప్పట్లపై, వారు నిద్రించిన బేకరీ మెట్లపై రక్తపు మరకలు, టైర్ల గుర్తులు లేవన్నారు. బాధితులు కారు తమను కొంతదూరం ఈడ్చుకుపోయిందన్నారని, కానీ చక్రాల మధ్య చిక్కుకున్న వారి స్థానంలో మార్పు లేదని అన్నారు. ప్రమాదం తర్వాత కారును పైకిలేపి బాధితులను బయటకి తీసినట్లు ప్రాసిక్యూషన్ వాదించగా డిఫెన్స్ లాయర్ మాత్రం కారు పైకి లేపుతుండగా బాధితులపై పడిందని వాదిస్తున్నారు. ఇది కోర్టు పెద్దలకు, వినే వారికి కొంత విచిత్రంగా అనిపించినా... నిజానిజాలేమిటో అక్కడున్న పెద్దలకు తెలిసినా... ఇలా కోర్టులో కేసులు సంవత్సరాలుగా నడవాల్సిందే... అభిమానులంతా ఎదురు చూడాల్సిందే కదా..!