తల్లి, బామ్మ పాత్రలకు పెట్టింది పేరైన సీనియర్ నటి మనోరమ ఇక లేరు. గుండెపోటుతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో శనివారం రాత్రి ఆమె కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆ మధ్య బాత్ రూంలో జారిపడటంతో తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. త్వరగానే కోలుకున్న సింగం-3 ద్వారా తిరిగి చిత్ర రంగ ప్రవేశం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ, ఇంతలోనే తిరిగి అనంతలోకాలకు చేరుకున్నారు. తెలుగు, తమిళం ఇతర భాషల్లో ఆమె వెయ్యికిపైగా చలన చిత్రాల్లో నటించారు.
1937, మే 26న తమిళనాడులోని తంజావూరులోని మన్నార్గుడిలో ఓ నిరుపేద కుటుంబంలో ఆమె జన్మించారు. తొలుత రంగస్థల నటిగా గుర్తింపు పొంది, తర్వాత సినీరంగంలోకి వచ్చారు. ఆమె అసలు పేరు గోపీశాంత. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు.
1958 లో మాలిట్టా మంగై అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఆచ్చిగా (బామ్మగా) ఆమె ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈమె మరో రికార్డు ఏంటంటే... అయిదుగురు ముఖ్యమంత్రులతో కలిసి సినీరంగంలో ఆమె పని చేశారు. తెలుగులో ఎన్టీఆర్, తమిళంలో ఎంజీఆర్, అన్నాదురై, కరుణానిధి, జయలలితతో కలిసి ఆమె సినిమాల్లో నటించారు. తమిళం, తెలుగు, మళయాళం, హిందీ భాషల్లో మనోరమ నటించారు. 1955 లో ఫిలిం ఫేర్ లైఫ్ అఛీవ్ మెంట్ అవార్డు సాధించారు. ఆమె నటించిన చివరి చిత్రం సింగం-2.
ఇక తెలుగులో 1980లో శుభోదయం సినిమాతో ప్రవేశించారు. 2002లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. మనోరమ నటించిన తెలుగు చిత్రాలు: శుభోదయం, జెంటిల్ మేన్ , రిక్షావోడు, పంజరం , బావనచ్చాడు , మనసున్నమారాజు , అరుంధతి , నీప్రేమకై , కృష్ణార్జున, యముడు, సింగం2.
ఇక మనోరమ మృతివార్త విన్న కోలీవుడ్ దు:ఖసాగరంలో మునిగిపోయింది. ఆమె భౌతికకాయాన్ని రజనీకాంత్, విజయ్, అజిత్, విజయ్ కాంత్ లతోపాటు పలువురు సీనియర్ నటులు, డీఎంకే అధినేత కరుణానిధి తదితరులు ఆమె పార్తివ దేహాన్ని దర్శించి నివాళులర్పించారు. ఇక ఆదివారం సాయంత్రం చెన్నైలోని మైలాపూర్ లో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. నటీనటులు, వేలాది మంది అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య ఆమె అంత్యక్రియలు జరిగాయి. ఆ మహానటి మృతికి నీహార్ ఆన్ లైన్ నివాళులు అర్పిస్తుంది.