సీనియర్ సంభాషణల రచయిత, సాహితీకారుడు గణేష్ పాత్రో (69) సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్నారు. చెన్నై లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఉదయం మృతి చెందారు. ఆయన స్వస్థలం విజయనగరం జిల్లా పార్వతీపురం. పలు తెలుగు, తమిళ చిత్రాలకు గణేష్ పాత్రో మాటలు రాశారు. నిర్ణయం, సీతారామయ్య గారి మనవరాలు, రుద్రవీణ, తలంబ్రాలు, ప్రేమించు పెళ్లాడు, మయూరి, మనిషికో చరిత్ర, గుప్పెడు మనస్సు, మరో చరిత్ర, అత్తవారిఇల్లు వంటి క్లాసిక్ చిత్రాలకు ఆయనే మాటలు అందించారు. దాదాపు పదిహేనేళ్ళ తర్వాత తిరిగి సినీ రంగానికొచ్చి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాకు సంభాషణలు సమకూర్చారు. నాటక రచయితగా గణేష్ పాత్రోకి మంచి పేరుంది. తరంగాలు, అసురసంధ్య నాటకాలూ, కొడుకు పుట్టాలా, పావలా, లాభం, త్రివేణి, ఆగండి! కొంచెం ఆలోచించండి మొదలైన నాటికలు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాయి. రచనలు చాలా తక్కువే అయినా, వ్రాసిన ప్రతి నాటికా, నాటకము రంగస్థలం మీద రక్తి కట్టి రసజ్ఞుల మెప్పుపొందింది.