హీరోగా అడపా దడపా సినిమాలు చేస్తున్నప్పటికీ పునర్ వైభవం రాబట్టుకోలేక చతికిలపడిపోతున్నాడు యాంగ్రీ యంగ్ మెన్(ఇప్పటికీ) రాజశేఖర్. చివరికి యూ టర్న్ తీసుకుని క్యారెక్టర్ ఉన్న పాత్రలకు ప్రాధాన్యం ఇవ్వటంతోపాటు అవసరమైతే నెగటివ్ రోల్స్ కూడా చేసేందుకు ముందుకు వచ్చాడు. దీంతో దర్శకుడు తేజ అహం అనే ఓ సినిమాలో విలన్ పాత్ర కోసం రాజశేఖర్ నే తీసుకున్నాడు కూడా. ఈ విషయాన్ని స్వయంగా తేజానే ప్రెస్ మీట్ లో వెల్లడించాడు. అయితే ఏమైందో తెలీదుగానీ, అహం నుంచి రాజశేఖర్ ను తప్పించి ఆ పాత్రకి మరో సీనియర్ నటుడ్ని ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనికి ఓ కారణం కూడా వినిపించింది. షూటింగ్ కి ఆలస్యంగా రావటంతోనే విసుగుచెందిన తేజ రాజశేఖర్ ను పక్కనపెట్టినట్లు తెలిసింది.
ఇక ఇప్పుడు ఈ వార్తలపై రాజశేఖర్ స్పందించాడు. అయితే ఇదంతా కేవలం పుకారు మాత్రమేనని రాజశేఖర్ చెప్పారు. ఈ సినిమాకి సంబంధించి కథా చర్చలు ఇంకా జరుగుతున్నాయని అన్నారు. షూటింగ్ మొదలైందనీ .. తనని తప్పించారని వస్తోన్న వార్తలు చూసి, తాను .. తేజ చాలా ఆశ్చర్యపోయామని చెప్పారు. ఇలాంటి వార్తలు రాసే ముందు సంబంధిత టీమ్ నుంచి ఒకసారి స్పష్టమైన సమాచారం తీసుకుంటే బావుంటుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.