మా ఎలక్షన్ల ఫలితాలు శుక్రవారం ప్రకటించారు. అధ్యక్ష పదవికి రాజేంద్రప్రసాద్ గెలుపొందగా, కార్యదర్శిగా శివాజీ రాజా గెలుపొందాడు. సహచర కమెడియన్ అలీపై ఆయన విజయం సాధించారు. వాస్తవానికి ఓ దశలో తాను పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు శివాజీరాజా ప్రకటించారు. అయితే, అప్పటికే విరమణకు గడువు ముగిసిపోయింది. దాంతో ఆయన కూడా పోటీలో ఉండాల్సి వచ్చింది. తాను పోటీలో ఉండట్లేదని, అందువల్ల తనకు వేయదలచుకున్న ఓట్లను కూడా తన బావ అలీకే వేయాలని కోరినట్లు విజయం అనంతరం మీడియాతో మాట్లాడిన శివాజీరాజా తెలిపారు. తాము ఇప్పుడు హీరోలుగా కనపడొచ్చు గానీ, వాస్తవానికి రెండేళ్ల పదవీకాలంలో తాము ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిన తర్వాతే అసలైన హీరోలు అవుతామని ఆయన చెప్పారు.