దక్షిణాదిన తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో సంగీత దర్శకుడిగా రాజ్య మేలింది ఒక్క ఇళయరాజా నే. దాదాపు వెయ్యికి పైగా చిత్రాలతో మ్యూజిక్ మ్యాజిక్ తో ఆకట్టుకున్న ఈ మేస్ట్రో తర్వాత ఆ రేంజ్ ఉన్నవారే ఇండస్ట్రీకి రాలేదనే చెప్పాలి. కానీ, తండ్రి నటనా వారసత్వాన్ని కొనసాగిస్తూ పూర్తిగా కాకపోయినా ఆడపాదడపా తెలుగు చిత్రాలతోపాటు తమిళంలో టాప్ సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నాడు యువన్ శంకర్ రాజా. చిన్నవయస్సులోనే చిత్ర రంగంలోకి అడుగుపెట్టి తండ్రికి తగ్గ తనయుడిగా ఖ్యాతి గడిస్తున్నాడు యువన్. ఈ రోజు (ఆగస్టు 31 ) అతని పుట్టిన రోజు ఈ సందర్భంగా నీహార్ ఆన్ లైన్ యువన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఈ సందర్భంగా యువన్ గురించి...
యువన్ 1979 లో ఆగస్టు 31 న జీవా -ఇళయరాజా దంపతులకు మూడో సంతానంగా జన్మించాడు. చదువును మధ్యలో ఆపేసి తన పదహారవ ఏటనే మ్యూజిక్ డైరక్టర్ గా కెరీర్ ను ఆరంభించాడు. అలా ముందుగా 1996 లో అరవిందన్ అనే తమిళ చిత్రానికి సంగీత దర్శకుడిగా బాధ్యతలు నిర్వహించాడు. అయితే ఈ చిత్రం, తర్వాత వచ్చిన మరో ఐదు చిత్రాలు కూడా తనకి పేరును తేలేకపోయాయి. కానీ, 2000 సంవత్సరంలో మురగదాస్ దర్శకత్వంలో అజిత్, లైలా జంటగా వచ్చిన దీనా చిత్రం యువన్ కు కమర్షియల్ గా మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ను అందించింది. ఇక అక్కడి నుంచి యువన్ తమిళంలో తిరుగులేని సంగీత దర్శకుడిగా మారిపోయాడు. సంగీతంలో పాశ్చ్యాత ఛాయలు ఉండటంతోపాటు రీమిక్స్ సాంప్రదాయనికి తెరతీయటంతో యూత్ లో యువన్ బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఓవైపు తమిళంతోపాటు అడపాదడపా తెలుగు చిత్రాలకు కూడా సంగీత దర్శకుడిగా పనిచేశాడు. తెలుగులో మొదటగా రాజశేఖర్ హీరోగా వచ్చిన శేషు చిత్రంలో నాలుగు పాటలను కంపోజ్ చేయగా, ఆ తర్వాత హ్యాపీ, రామ్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఎస్సెమ్మెస్, ఓయ్, పంజా, దేనికైనా రెడీ, గోవిందుడు అందరి వాడేలే చిత్రాలతోపాటు పందెం కోడి, అవారా, నాపేరు శివ లాంటి తమిళ్ డబ్ చిత్రాలతో కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక వైవాహిక జీవితానికొస్తే యువన్ మూడు వివాహాలు చేసుకున్నాడు. 2005 లో చెన్నైకి చెందిన తన గర్ల్ ఫ్రెండ్ సుజయ చంద్రన్ పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో మనస్పర్థలతో విడిపోయి, 2011 లో శిల్ప మోహన్ అనే మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కానీ, ఈ దాంపత్యం కూడా ఎంతో కాలం నిలవలేదు. గతేడాది చివర్లో ఇస్లాం మతానికి స్వీకరిస్తున్నట్లుగా ప్రకటించిన యువన్ పేరును అబ్దుల్ కలీక్ గా మార్చుకున్నట్లు ప్రకటించి జనవరి 1 2015 దుబాయ్ కి చెందిన ఫ్యాషన్ డిజైనర్ జాఫ్రున్ నిజార్ ను ముచ్చటగా మూడో వివాహం చేసుకున్నాడు. చిన్న వయస్సులో నే ఇండస్ట్రీకి వచ్చిన యువన్ తన సంగీతం, ముఖ్యంగా నేపథ్య సంగీతానికి ప్రేక్షకులతోపాటు విమర్శుల మన్ననలు సైతం అందుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడికి తన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. ఇలాంటి మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆశిస్తూ మరోకసారి నీహార్ ఆన్ లైన్ తరపు నుంచి హ్యాపీ బర్త్ డే టూ యువన్...