ఓవైపు నటన, మరో వైపు అశేష ప్రజాదరణ. వెండితెరపైనే కాదు నిజజీవితంలోనూ ఆయన హీరోనే. స్క్రీన్ పై కనిపిస్తే చాలు, మెడపై ఆ చెయ్యి అలా నిమిరితే చాలు జనాలకు ఎక్కడా లేని ఎనర్జీ వచ్చేస్తుంది. సమకాలీన కథానాయకులకు, ఆయన ఆలోచనా విధానాలకు చాలా తేడా ఉంటుంది. ఆ ధోరణే ఆయనకి చిత్రసీమలో ప్రత్యేక స్థానాన్ని కట్టబెట్టింది. నటనతోనే ఆపకుండా అన్నం అందించే అన్నదాత సమస్యలను నెత్తిన వేసుకుని వారి తరపున పోరాటం చేస్తున్న జన నేత. కొణిదెల పవన్ కళ్యాణ్ బాబు ఊరఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ రోజు ఆయన ఫ్యాన్స్ కి పండగ. ఆయన పుట్టిన రోజు ... ఈ సందర్భంగా నీహార్ ఆన్ లైన్ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఈ సందర్భంగా పవన్ పై ప్రత్యేక కథనం...
కొణిదెల అంజనా దేవీ-వెంకటరావు దంపతుల ఐదో సంతానంగా సెప్టెంబరు 2, 1971న జన్మించాడు. ఇతనికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు. నెల్లూరు లోని వీఆర్ సీ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసి ఆ తర్వాత కంప్యూటర్స్ లో డిప్లోమా చేశాడు. తెలుగు సినీ పరిశ్రమలో అగ్రనటుడిగా వెలుగొందుతున్న తన అన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల ఆసక్తి ని పెంచుకున్నాడు. మెగాబ్రదర్ ముద్దుల తమ్ముడిగా... 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడీ కళ్యాణ బాబు. గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రీ, ఖుషీ ఇలా వరుస హిట్లతో యూత్ ను అట్రాక్ట్ చేశాడు. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది లాంటి ఆల్ టైం హిట్స్ తో తిరిగి ఇండస్ట్రీని శాసిస్తూ ట్రెండ్ ను సెట్ చేస్తున్నాడు. స్వతహాగా మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశం ఉండటంతో తన చిత్రాల్లో చాలా వరకు తానే ఫైట్స్ ను కంపోజ్ చేసుకోవటంతోపాటు అన్నయ్య చిత్రాలకు కూడా పనిచేశాడు. తమ్ముడు చిత్రంలో లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ పాటను పూర్తి నిడివి ఆంగ్ల గీతంగా రూపొందించారు. తన చిత్రాల్లో చాలా వరకు పాటలకు ఆయన నృత్యాలు కూడా సమకూర్చుకున్నారు కూడా. పాత సినిమాల్లోని పాటలపై అభిమానంతో వాటిని తన చిత్రాల్లో రీమేక్ చేయించుకున్నారు. ఓ ప్రత్యేకమైన స్టైల్ తో జనాల్లో ముఖ్యంగా యువతలో ఆయన క్రేజ్ అమోఘం.
నటి రేణూ దేశాయ్ ని 28 జనవరి 2009 న వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రఖ్యాత జపనీస్ దర్శకుడు అకీరా కురుసోవా పై అభిమానంతో కుమారుడికి అకీరా నందన్ అని పేరు పెట్టుకున్నాడు. పాప పేరు ఆద్యా. 2013 సెప్టెంబరు 30న ఇతని వివాహము రష్యా నటి అన్నా లెజ్‌నేవా తో జరిగింది.
ఆయన అభిమానులు 'పవనిజం' పేరిట పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. నటుడిగానే ఓ సామాజిక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా పలు సహయ కార్యక్రమాలు అందిస్తూ వస్తున్నారు. ప్రజా పక్షాన నిలిచి వారి సమస్యలపై పోరాడేందుకు జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరిన్నీ జరుపుకోవాలని కొరుకుంటూ నీహార్ ఆన్ లైన్ తరపు నుంచి మరోసారి హ్యాపీ బర్త్ డే టూ పవర్ స్టార్...