తెలుగు సినీ జగత్తులో ధృవతారలుగా వెలిగిన కొందరు నటీనటుల్లో అంజలీ దేవి ఒకరు. లవకుశ చిత్రంలో ఆమె పోషించిన సీత పాత్ర నేటికి మన కళ్ల ముందు కదలాడుతుంది. గ్లామర్ అనే పదానికి కనపడనంత దూరంలో ఉండి తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రజల మనస్సులో చిరకాలం నిలిచిపోయిన నటీమణి. సీతమ్మగా, అనార్కలిగా ఆమె నటన అద్భుతం. తన వయసుకు మించిన పాత్రల్ని కూడా ఆ రోజుల్లోనే నటించి మెప్పించారు. ఆ రోజుల్లో అత్యధిక పారితోషకం తీసుకున్న తొలి నటి ఆమెనే. ఈ రోజు (ఆగష్టు 24) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె గురించి నీహార్ ఆన్ లైన్...
అంజలీదేవి 1927, ఆగష్టు 24న తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురం లో జన్మించింది . ఆమె అసలు పేరు అంజనీ కుమారి. అయితే దర్శకుడు సీ పుల్లయ్య ఆమె పేరును అంజలీ దేవిగా మార్చాడు. తన నటనా జీవితాన్ని రంగస్థలంతో ప్రారంభించింది. ఆ తర్వాత సినీ రంగం వైపు అడుగులు వేసింది. లవకుశ, సువర్ణ సుందరి, అనార్కలీ, బండిపంతులు, బోగి మంటలు, వీరాంజనేయ, భక్త ప్రహ్లాద తదితర చిత్రాల ద్వారా చిరస్థాయి గుర్తింపు పొందారు. నిర్మాతగా అంజలీ పిక్చర్స్ పై 27 చిత్రాలను నిర్మించింది. ఇందులో చాలా వరకు విజయవంతమైన చిత్రాలే. ఆమె నర్తకి కూడా. ప్రముఖ సంగీత దర్శకుడు పి.ఆదినారాయణరావును ఆమె వివాహం చేసుకున్నారు. సినీరంగానికి చేసిన సేవలకు గాను పలు సత్కారాలు ఆమెను వరించాయి. నాలుగు ఫిలిం ఫేర్ అవార్డులు, 2005లో రఘుపతి వెంకయ్య అవార్డు, 2006లో రామినేని ఫౌండేషన్ విశిష్ఠ పురస్కారం, 2008లో ఎఎన్నాఆర్ అవార్డులను అంజలి దేవిని అందుకున్నారు. అంజలీ దేవి చివరి చిత్రం బిగ్ బాస్. తెలుగుతో పాటు హిందీ, తమిళ చిత్రాల్లో నటించారు. జనవరి 13 2014 లో తన 86వ ఏటా చెన్నైలోని ఆమె స్వగృహంలో అనారోగ్యంతో తనవు చాలించారు.
హీరోయిన్ కు నిలువెత్తు నిదర్శనం ఆమె. ఇలాంటి నటీమణులు అరుదుగా వస్తుంటారు. భౌతికంగా ఆమె దూరమైన జన హృదయాల్లో తన నటటన ద్వారా ఇప్పటికీ ఆమె జీవించి ఉంటారు. ఆమెకు నీహార్ ఆన్ లైన్ తరపు నుంచి నమ:సుమాంజలి...