బాహుబలిని కొట్టేవిధంగా భారీ బడ్జెట్, విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కిందని చెప్పుకొస్తున్న చిత్రం పులి. భారీ హంగులు, ఆర్భాటాల మధ్య ఈ మధ్యే రిలీజైంది. కానీ, కంటెంట్ లో పస లేకపోవటం, విజువల్స్ కూడా నాసిరకమని విమర్శకులు తేల్చేయటంతోపాటు చిత్రంకు మిక్స్ డ్ టాక్ రావటంతో కాస్త వీక్ కలెక్షన్లతో నడుస్తుంది. అయితే తెలుగులో ఈ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. కనీసం థియేటర్ల వైపు చూసేవారే కరువయ్యారు.
దీంతో పులి టీం రక్షణ చర్యలు ప్రారంభించింది. విడుదలకు ముందు మీడియా వైపు కన్నెత్తి చూడని నిర్మాణ సంస్థ కనీసం ప్రచారంతోనైనా తిరిగి బతికించుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించింది. ఇక వీరికి బాసటగా నిలిచేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ముందుకు వచ్చాడు. అందునా రజనీకాంత్ కు సోషియో ఫాంటసీ చిత్రాలు అంటే వల్లమానిన అభిమానం. దీంతో పులిపై ప్రశంసలు కురిపించాడు సూపర్ స్టార్. విజయ్ చేసిన ఈ ప్రయత్నం అభినందనీయమని, ముఖ్యంగా పులి గ్రాఫిక్స్ హాలీవుడ్ స్థాయిని అందుకునేలా ఉందని పొగిడాడు. పనిలో పనిగా శ్రీదేవీ నటనపై ప్రశంసలు కురిపించాడు రజనీ. ఫ్యామిలీ ఆడియన్స్ కి ముఖ్యంగా పిల్లలని చిత్రం బాగా ఆకట్టుకుంటుందని చెప్పాడు. జరగాల్సిన నష్టం జరిగిపోతున్న టైంలో రజనీ ప్రశంసలు కాస్త ఊరట కలిగించినా కలెక్షన్లు రాబట్టడం కష్టమే. భారీ నష్టాల నుంచి బయటపడకపోగా, బయ్యర్లకు తీవ్ర నష్టమే అని క్లియర్ గా తెలిసిపోతుంది.