నిజమే... తాగుబోతులుగా ఎందరు నటించినా, కిక్కెక్కించిన నటుడు మాత్రం తాగుబోతు రమేషే... అందరూ కొద్దో గొప్పో పుచ్చకుని నటించే వాళ్ళూ ఉన్నారేమో.... గానీ అసలు మందు ముట్టుకోని నటుడు రమేష్ అంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. సోమవారం పాల్వంచలోని కేఎల్‌ఆర్ ఫార్మసీ కళాశాలలో జరిగిన ఫేర్‌వెల్ నైట్ కార్యక్రమంలో పాల్గొని ఆయన విలేకర్లతో మాట్లాడాడు. ఇంతకుముందే చాలా ఇంటర్వ్యూల్లో ఆయన నటన గురించి, అలా అంత బాగా నటించడానికి గల కారణం కూడా చెప్పుకున్నారు. అదే విషయాన్ని మళ్ళీ ఒకసారి పంచుకున్నారు. చదువులో అంతగా రాణించలేదనీ, మొదటి నుంచి మిమిక్రీ అంటే ఇష్టం ఉండడం చేత, ప్రాక్టీస్ చేసి ప్రదర్శనలు ఇచ్చేవాడినని చెప్పుకున్నారు. సినిమాల్లో నటించాలనే కోరికతో 2006లో హైదరాబాద్ చేరుకున్నాననీ, ‘జగడం’ సినిమాలో మొదటి ఛాన్సూ ఆ తర్వాత ‘మహాత్మ’లో మరో ఛాన్స్ వచ్చిందని చెప్పారు. ఈ సినిమాలే ఆ తరువాత వంద సినిమాలు చేయడానికి అవకాశం కల్పించాయని చెప్పాడు. కామెడీలో మూస ధోరణి కాకుండా కొత్తగా ఏమైనా చేయాలని ఉందని అన్నారు. తనకు ‘తాగుబోతు రమేష్’ అనే ప్రత్యేక మైన పేరిచ్చి తన కామెడీని ఆస్వాదించడం చాలా సంతోషంగా ఉందన్నాడు. తనను ఎంకరేజ్ చేసిన దర్శకులు నందినీరెడ్డి, రాజమౌళి, శ్రీను వైట్ల కు ఆయన క్రుతజ్నతలు చెప్పుకున్నాడు. తన అభిమాన కమెడియన్లు.. హిందీలో కెస్టో ముఖర్జీ. తెలుగులో ఎంఎస్.నారాయణ అని చెప్పారు. వారిలాగా తాను కూడా పేరు సంపాదించుకోవాలనుందన్నారు ఈ కిక్కిచ్చే కమెడియన్.