అప్పట్లో తమిళ సినిమా జంటల్లో హిట్ పెయిర్ అంటే ప్రభు, ఖుష్బూల పేర్లు వినిపించేవి. ఈ ఇద్దరూ కలిసి దాదాపు అరడజను సినిమాల్లో నటించారు. ప్రభు, ఖుష్బూ జంటగా నటించిన చిత్రాల్లో ‘చిన్న తంబి’ ఒకటి. ఇది వెంకటేష్ హీరోగా వచ్చిన ‘చంటి’ సినిమా. ఇది అలా ఉంచితే, ఆనాడు ప్రభు, ఖుష్బూ ప్రేమలో పడ్డారనీ, రహస్య వివాహం కూడా చేసుకున్నారని బాగా వార్తలు వినిపించాయి. అప్పటికే ప్రభు వివాహితుడు కావడం, కుటుంబ సభ్యుల జోక్యం వల్ల ఖుష్బూతో కలిసి నటించడం, కలవడం మానుకున్నాడనే వార్త కూడా ప్రచారంలో ఉంది. 1995లో వచ్చిన ‘చిన్న వాద్దియార్’ వీరిద్దరూ కలిసి నటించిన చివరి చిత్రం. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ వీరు తెరపై కనిపించే అవకాశం ఉందనేది తాజా సమాచారం. త్వరలో ఆరంభం కానున్న ‘వందాళ్’ అనే ఓ తమిళ చిత్రంలో ఈ ఇద్దరూ కీలక పాత్రలు చేయనున్నారట. ఒక వేళ అదే నిజమయితే ఈ జంట 20 ఏళ్ల తర్వాత తిరిగి తెరపై కనిపించినట్లవుతుంది.