ఇటీవల ‘బస్తీ’ ఆడియో ఫంక్షన్‌కు ముఖ్య అతిధిగా విచ్చేసి.. తెలుగు చిత్ర పరిశ్రమపై వరాల జల్లు కురిపించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసియార్‌కు ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్’ కృతజ్ఞతలు ప్రకటించింది. ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో టిఫ్‌సిసి అధ్యక్షులు ప్రతాని రామకృష్ణగౌడ్, ఉపాధ్యక్షులు అలీఖాన్, కార్యవర్గ సభ్యులు సాంబశివరాజు, అలీఖాయ్, శంకర్‌గౌడ్, సోమిరెడ్డి, జి.రవితేజ, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనిజ, యం.సునీల్‌కుమార్, ఏలూరు సురేందర్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, తెలంగాణ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ ప్రెశిడెంట్ కెవిన్ తదితరులతోపాటు.. నిర్మాతల మండలి కార్యదర్శి కొడాలి వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు. కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ నుంచి తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆప్ కామర్స్‌కు అధికార గుర్తింపు లభించిందని.. ఎపి ఫిలిం ఛాంబర్ తరహాలోనే తాము కూడా ఇక నుంచి తమ వద్ద నమోదైన సినిమాలకు పబ్లిసిటీ క్లియరెన్స్ ఇవ్వనున్నామని.. టైటిల్స్ రిజిస్ట్రేషన్ సైతం తమ వద్ద చేసుకోవచ్చని ఈ సందర్బంగా రామకృష్ణగౌడ్ ప్రకటించారు. త్వరలోనే తమ సభ్యులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వనున్నామని కూడా ఆయన తెలిపారు. తెలంగాణ సియం రిలీఫ్ ఫండ్ కోసం తలపెట్టిన టాలీవుడ్ వెర్సస్ కోలీవుడ్ ‘స్టార్ క్రికెట్ లీగ్’ను ఆగస్టు 15న నిర్వహించనున్నాయని రామకృష్ణగౌడ్ అనౌన్స్ చేసారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అభివృద్ధికి ఇతోధికంగా పాటుపడుతున్న రామకృష్ణగౌడ్‌ను కొనియాడిన మిగతా వక్తలందరూ.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఫిలింనగర్`2తోపాటు.. మరో చిత్రపురి కాలనీని సైతం ఏర్పాటు చేసి.. ఇళ్లు లేని వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన కేసీయార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు ప్రకటించారు!!