సీనియర్ గాయకుడు రామకృష్ణ కన్నుమూశారు. గత కొంత కాలంగా కేన్సర్‌తో బాధ పడుతూ గురువారం ఉదయం రామకృష్ణ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మృతి చెందారు. ఆయన పూర్తి పేరు విస్సంరాజు రామకృష్ణ. విస్సంరాజు రంగశాయి, రత్నం దంపతులకు 1947 ఆగస్టు 20న విజయనగరంలో రామకృష్ణ జన్మించారు. భక్తి పాటలకు ఆయన పెట్టింది పేరు. దాదాపు 200 చిత్రాల్లో 5వేలకు పైగా పాటలు పాడారు. ప్రముఖ గాయని పి. సుశీల రామకృష్ణకు పిన్ని అవుతారు. చిన్నతనంలో సంగీతంపై ఆసక్తితో నేదునూరి కృష్ణమూర్తి దగ్గర శాస్త్రీయ సంగీతంలో మెళకువలు నేర్చుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, శోభన్‌బాబు, కృష్ణంరాజు తదితర అగ్ర తారల చిత్రాల్లో ఆయన పాటలు పాడారు. మహాకవి క్షేత్రయ్య, దానవీరశూరకర్ణ, అమరదీపం, శ్రీమద్‌విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, శ్రీషిర్డీసాయిబాబా మహత్యం, బలిపీఠం, గుణవంతుడు, అందాలరాముడు, తాతా మనవడు, భక్తతుకారం, శారద, భక్తకన్నప్ప, కృష్ణవేణి, అల్లూరి సీతారామరాజు, కరుణామయుడు వంటి ఎన్నో చిత్రాల్లో ఆయన పాటలు పాడారు. తన సుమధుర గాత్రంతో ప్రేక్షకుల మదిలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారు. ఘంటసాల స్ఫూర్తితో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన కొద్దికాలంలోనే పాపులర్ అయ్యారు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు సాయి కిరణ్ ఉషాకిరణ్‌మూవీస్ 'నువ్వే కావాలి' చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత చాలా చిత్రాల్లో, ప్రస్తుతం సీరియల్స్ లో నటిస్తున్నాడు. కాగా, రామృకృష్ణ మృతిపట్ల సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నీహార్ ఆన్ లైన్ ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తోంది.