ఎన్టీఆర్ కెరీర్ లో పోలీస్ ఆఫీసర్ గా నటించిన సినిమాల్లో బాద్షా మొదటిది. ఇప్పుడు విడుదల కాబోతున్న టెంపర్ లో పూర్తిస్థాయి పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఎన్నో వాయిదాలూ, అవాంతరాల మధ్య విడుదల కాబోతున్న ఈ చిత్రంలో కొద్దిగా సెన్సార్ కత్తెర పడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మొదట ఎన్టీఆర్ ఓ కరెప్టెడ్ ఆఫీసర్ గా కనిపిస్తాడట. సినిమాకు కీలకమైనది ఓ రేప్ కేస్. దాని తరువాత ఎన్టీఆర్ లో మార్పుతో తరువాత కథ నడుస్తుంది. చిత్రంలో పూరీ జగన్నాథ్ ఎంతో ఇష్టంగా రాసిన డైలాగులను సెన్సార్ వారు అభ్యంతరకరమైనవిగా భావించారు. ఒక సీన్ లో ‘గాంధీ గాంధీ అని అరవడం కాదు. ఈ దేశంలో జరిగే ప్రతీ అవినీతికి మొదటి సాక్షి ఈ గాంధీ’ అనే డైలాగ్ ఉందట. అయితే సెన్సార్ వారు మాత్రం ఈ డైలాగ్ వల్ల రకరకాల వివాదాలు వస్తాయని గాంధీ పేరుతో కొనసాగుతున్న ఒక ప్రముఖ రాజకీయ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నట్లుగా ఈ డైలాగ్ అర్ధం కలిగిస్తుందని అనడంతో పూరి అయిష్టంగానే ఈ డైలాగ్ తొలిగించడానికి ఒప్పుకున్నాడట. ఇక రేప్ సీన్స్ కూడా భయంకరంగా ఉన్నాయనడంతో వాటిని బ్లాక్ అండ్ వైట్ లో బ్లర్ చేసి చూపించాలని అనుకుంటున్నారట. విజువల్స్ చాలా డిస్ట్ర్రబ్ గా ఉన్నాయని సెన్సార్ బోర్డ్ ఫీలవటం జరిగిందని సమాచారం. ముఖ్యంగా కాజల్ మరియు ఐటం గర్ల్ కు చెందిన కొన్ని ఎక్సిపోజింగ్ సన్నివేశాలు బ్లర్ చేశారట. సినిమాలోని రేప్ సీన్ లో వయిలెన్స్ కు సెన్సార్ వారు భయపడ్డారని తెలుస్తోంది. దేశంలో జరుగుతున్న అన్యాయాల పై పూరి వెలుబుచ్చిన ఆవేశం జనంలోకి వెళ్ళకుండా సెన్సార్ కత్తెరతో మరోసారి మూగబోతోంది.