పరిశ్రమలో ఇలా వచ్చి అలా గొప్ప పేరు తెచ్చుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలి. జీవితకాలం పోరాటం చేసినా... తెరమీద పేరు తెచ్చుకోలేని నటులు ఎందరో ఉన్నారు. కష్టపడ్డా ఇన్నేళ్ళకైనా పృథ్వీకి గుర్తింపు వచ్చింది. అది కూడా ఓ అదృష్టంగానే భావించాలి. పృథ్వీ ఎప్పటి నుంచో ఇండస్ట్రీ లో ఉన్నప్పటికీ ఓ నటుడిగా ప్రేక్షకులు గుర్తించింది ఇప్పుడే. అంటే ఈ స్టేజికి రావడానికి ఆయనకు 30 ఏళ్ళు పట్టిందట. ఆంధ్రా యూనివర్శిటీలో ఎకనమిక్స్ లో పీజీ పూర్తి చేసిన పృథ్వీ ఒక దశలో వెయిటర్ గా, ఓ అతిధిగృహంలో రిసెప్షనిస్టు గా, వీడియో షాప్ లోనూ పని చేసాడట. ఇదంతా అతడు చెన్నయ్ లో సినిమాలకు ప్రయత్నిస్తున్న సమయంలో కూటి కోసం పడ్డ కోటి తప్పలు. అక్కడ ప్రభాకర్ రెడ్డి దేవుడి లా తనను ఆదుకున్నారని పృథ్వీ ప్రతి సందర్భంలోనూ గుర్తు చేసుకుంటాడు. తన సినిమా ప్రయాణం గురించి చెపుతూ ‘‘1992లో ‘ఆ ఒక్కటి అడక్కు’ చిత్రంతో కెరీర్ ప్రారంభించాను. రెండు దశాబ్ధాలుగా పరిశ్రమలోనే ఉన్నా. 100కు పైగా సినిమాల్లో నటించాను. ఈ సినిమా పరిశ్రమలో ఎన్నో ఎత్తు పల్లాలు కష్టనష్టాలు ఇక్కడ. కొన్నిసార్లు ఇక మనవల్ల కాదు.. తిరిగి ఊరెళ్లిపోదాం అనుకునేవాడిని. కానీ ఏదో ఒకరోజు నా పేరు వినబడకపోదు.. అని తిరిగి ఆశతో ప్రయత్నించేవాడిని. సొంతూరు తాడేపల్లి గూడెంలో ఉన్నప్పట్నుంచి కల్చరల్ ఈవెంట్లలో పార్టిసిపెంట్ ని. యూనివర్శిటీలో ఉన్నప్పుడు అంతే యాక్టివ్ గా ఉండేవాడిని. అందుకే నేను సినీ పరిశ్రమకి వెళతానంటే అమ్మ కూడా అడ్డు చెప్పలేదు. తన ప్రోత్సాహం ఎప్పుడూ ఉంది. నాకు రావుగోపాల్ రావుగారు ఇన్ స్పిరేషన్. ఆయన్ని కలిసి ఎన్నో సలహాలు తీసుకున్నా. పరిశ్రమ ఎలా ఉంటుందో చెప్పింది గోపాల్ రావుగారే. నా జీవితంలో విలువైన సమయాన్ని ఆయనతో కలిసి గడిపాను. ఆ ఒక్కటి అడక్కు చిత్రంలో నటించిన తర్వాత చెన్నయ్ వెళ్లాను. రాత్రులు ఉద్యోగాలు చేస్తూ పొట్ట పోషించుకుని పగలు సినిమాల్లో ప్రయత్నించేవాడిని. అక్కడ ఉన్నప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు నన్ను దేవుడిలా ఆదుకున్నారు. ఉద్యోగం ఇప్పించారు. పరిశ్రమలో అవకాశాలిప్పించారు. పరిశ్రమ చెన్నయ్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా ప్రభాకర్ గారే సాయం చేశారు. నేను ఈ రోజు ఇక్కడ ఉన్నానంటే ఆ దేవుడి వల్లే. జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. హైదరాబాద్ వచ్చాక కృష్ణానగర్ లో ఓ చిన్న రూమ్ లో వేరొక స్నేహితుడితో కలిసి ఉండేవాడిని. ఇద్దరం ఒక కేజీ బియ్యాన్ని వారం వండుకు తినేవాళ్లం. కష్టాలు బాధలు అన్నిటినీ పంచుకునేవాళ్లం. లౌక్యం సినిమాలో 'బాయిలింగ్ స్టార్ బబ్లూ'గా నటించాను. ఈ పాత్ర నా జీవితాన్ని మార్చేసింది. చక్కని గుర్తింపు తెచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన శ్రీవాస్ కి ఎప్పటికీ రుణపడి ఉంటాను. డిక్టేటర్ కిక్2 బెంగాల్ టైగర్ చరణ్ సినిమా . అన్నీ పెద్ద అవకాశాలే. ఇప్పటికి జీవితంలో సెటిలయ్యా’’ అన్నాడు తన సినీ ప్రయాణం అంతా ఓసారి కళ్ళముందు కదలాడుతుండగా...