తెలుగు సినీ పరిశ్రమకు దర్శకరత్న దాసరి నారాయణ రావు చేసిన సేవలు ఎనలేనివి. అత్యధిక సినిమాలు తీసిన దర్శకుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్న బహుముఖ ప్రఙ్ఞాశాలి. 1947, మే 4న పశ్చిమ గోదావరి జిల్లాలో, పాలకొల్లులో జన్మించిన దాసరి నారాయణ రావు నేటికి 71 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఈయన దర్శకుడిగానే కాకుండా, నటుడిగా, నిర్మాతగా, మాటలు, పాటల రచయితగా అన్ని శాఖల్లో తన ప్రతిభను చాటుకున్న మహానుబావుడు. విభిన్న చిత్రాల దర్శకుడిగా కూడా ఆయనకు పేరుంది ఎన్టీఆర్, ఎఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి స్టార్ నటులతో కమర్షియల్ సినిమాలు నిర్మించిన ఘనతతో పాటు కొత్త నటులతో స్వర్గం-నరకం, తాతా-మనవడు వంటి విజయవంతమైన చిన్న చిత్రాలను అందించిన దర్శకునిగా చరిత్రలో నిలిచిపోయారు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించి, 53 సినిమాలు స్వయంగా నిర్మించారు. ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా, గేయ రచయితగా కూడా పనిచేశాడు. తెలుగు, తమిళం, కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి అందుకున్నారు.
కళాశాలలో చదివేరోజులలో ఆయన అనేక నాటకపోటీలలో పాల్గొనేవారట. అతి కొద్ది కాలంలోనే ప్రతిభ గల రంగ స్థల నటుడి గా, నాటక రచయిత గా చిత్ర దర్శకుడి గా గుర్తింపు పొందారు. ఈయన అనేకమంది కొత్త కళాకారులను సినీరంగానికి పరిచయం చేసి, వారు పెద్ద తారలుగా ఎదగడానికి దోహదపడ్డారు. ఒకానొక సమయంలో ఈయనకు18వేల అభిమానసంఘాలు ఉండేవట.
ఈయన దర్శకత్వం వహించిన మేఘసందేశం, మామగారు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి. ఈయన సినిమాలు ముఖ్యంగా స్త్రీ ప్రధానంగా ఉండి సందేశాత్మకంగా ఉండడం విశేషం. బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయుడు వంటి చిత్రాలు ఎన్టీఆర్ రాజకీయంలోకి రావడానికి బాగా ఉపయోగపడ్డాయని చెప్పుకోవచ్చు. మామగారు, సూరిగాడు, ఒసేయ్ రాములమ్మ చిత్రాలు దాసరి నటనా కౌశలానికి మచ్చుతునకలు. ఈ సినిమాల్లో ఈయన నటనకు ఎందరో ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు.
ఇక సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోనూ ప్రవేశించారు. రాజీవ్ గాంధీ హయాంలో ఈయన కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. రాజీవ్ హత్యానంతరం పార్టీ కి కాస్త దూరంగా ఉన్నా తిరిగి, 1990 చివర్లో ఆయన తెలుగుతల్లి లనే ఒక రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఈ పార్టీకి కోస్తా ప్రాంతాలలోని కాపు వర్గాల నుండి మంచి స్పందన లభించింది. ఆ తర్వాత మాత్రం ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. బొగ్గు, గనుల శాఖ కేంద్రమంత్రిగా కూడా వ్యవహరించారు.
ఇన్ని రంగాల్లో సమర్దవంతంగా పనిచేసిన ఈయన 1985లో ఓ ప్రముఖ పత్రికకు ధీటుగా ‘ఉదయం’ అనే వార్తా పత్రికను కూడా నడిపారు. ఈయన సంపాదకీయంతో పాటు ఎన్నో కొత్త ఫీచర్లను పాఠకులకు పరిచయం చేసిన ఘనతను కూడా దక్కించుకున్నారు. నేటికి దర్శకరత్న 71 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నీహార్ఆన్ లైన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు అందిస్తోంది.