దర్శకరత్న దాసరి నారాయణరావు ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్వయంగా ఇంటికి వెళ్లి మరీ కలవటం, ఆపై సినిమా అంటూ ప్రకటన వెలువడి దాదాపు ఏడాదిన్నర దాటింది. కథానాయకుడిగా తాను ఒక సినిమాను నిర్మించనున్నట్టు ఆ మధ్య దాసరి నారాయణరావు ఒక ప్రకటన చేశారు. ఆ తరువాత ఆ సినిమా గురించి రకరకాల వార్తలు వచ్చాయి. అగ్రదర్శకులతోసహా పలువురు యువ దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. చివరికి దాసరియే దానికి దర్శకత్వం వహిస్తారని కూడా గాసిప్స్ వచ్చాయి. ఆపై కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో అసలు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఉండదని కూడా అనుకున్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి దాసరి ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
పవన్ కల్యాణ్ తో తాను నిర్మించబోయే సినిమాకి ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోందని చెప్పారు. ఈ సినిమాకి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్టు రెడీ చేస్తున్నాడని అన్నారు. అయితే దర్శకుడు మాత్రం త్రివిక్రమ్ కాదని, అది ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ అని చెప్పారు. ప్రస్తుతం పవన్ చేస్తోన్న ఎస్.జె.సూర్య సినిమా తరువాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు. నిజానికి 'సర్దార్ గబ్బర్ సింగ్' తరువాత దాసరి పవన్ సినిమా ఉంటుందని అభిమానులు భావించారు. ఆపై సూర్యతో సినిమా మొదలుపెట్టేసరికి ఇక అది డౌటే అనుకున్నారంతా. ఇక ఇప్పుడు స్క్రిప్ట్ పనులు ఏకంగా మాటల మాంత్రికుడు చూస్తుండటంతో ఈ యేడాది చివర్లోనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.