రుద్రమ్మకు లొకాలిటీ ప్రాబ్లమ్!!

October 08, 2015 | 11:28 AM | 3 Views
ప్రింట్ కామెంట్
reason-behind-anushka-rudramadevi-postponment-niharonline

దేశాల మధ్య, ప్రాంతాల మధ్య ఎన్ని వైరాలున్నా సినిమాల విషయానికొచ్చేసరికి మాత్రం ఆ ఫీలింగ్ లు ఎక్కడా కనపడవు. దాయాది దేశం పాకిస్థాన్ లో సైతం మన చిత్రాలు ఆడటం, బ్లాక్ బస్టర్ లు అవ్వటం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. కానీ, భాషా, ప్రాంతీయ ప్రతిపాదికన సినిమాలను పోల్చకుని వాటిపై లేని పోని విమర్శలు చెయ్యటం, లేదా అడ్డుకోవడానికి ప్రయత్నించటం మాత్రం దారుణం. కానీ, ఇక్కడ ఓ తెలుగు సినిమాని తెలుగు వారే అడ్డుకుంటున్నారా అన్న సందేహాలు కలగక మానదు.  12 ఏళ్ల తన కలగా, ప్రాణంగా చెప్పుకుంటూ వస్తున్న రుద్రమ దేవీ సినిమా కోసం గుణశేఖర్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. దాదాపు ఎనిమిదేళ్ల గ్రౌండ్ వర్క్, ఆస్తులన్నీ అమ్ముకుని ఈ సినిమాపైనే పెట్టుబడులు పెట్టాడు. అన్నీ సజావుగా సాగుంటే ఈ చిత్రం రెండేళ్ల క్రితమే రావాలి. కానీ, ఏ సినిమాకు ఎదురవ్వని చిక్కులు దీనికి ఎదురయ్యాయి. భారీ బడ్జెట్, భారీ ప్రాజెక్టు, పైగా స్టార్ హీరోలతో చేసిన దర్శకుడు గుణశేఖర్. మరి అలాంటి వ్యక్తికి ఇంతలా సమస్యలు ఎదరవ్వటానికి కారణం ఏమిటి?

గతంలోకి ఒక్కసారి వెళ్లి చూస్తే... తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగసిపడుతున్న సమయంలో దర్శకుడు ఎన్. శంకర్ విడుదల చేసిన చిత్రం జై బోలో తెలంగాణ. కంటెంట్ పరంగా చిత్రంలో ఎక్కడా అవమానకరరీతి సన్నివేశాలు, అభ్యంతరకర డైలాగులు లేకపోయినప్పటికీ, అప్పటికీ సమైక్యంలోనే ఉన్నప్పటికీ ఆంధ్రా ప్రాంతంలో ఆ చిత్రాన్ని నిషేధించారు. అంతేకాదు భవిష్యత్తులో అవకాశాలు లేకుండా చేస్తామని ఆ చిత్రంలో పనిచేసే చిత్ర బృందానికి పరోక్షంగా వార్నింగ్ లు కూడా ఇచ్చారు కొందరు సినీ పెద్దలు. అది పక్కనబెడితే రుద్రమ్మ విషయంలో కూడా ఇప్పుడు ఇదే జరుతుందా అన్న అనుమానాలు కలగక మానవు. తెలంగాణ ప్రాంతంలో కాకతీయ సామ్రాజ్య విస్తరణ, శత్రువులను చీల్చి చెండాడిన వీర వనిత రుద్రమ్మ దేవీ కథాంశం ఇది. అందుకే బాహుబలి లాంటి చిత్రానికి స్వచ్ఛందంగా ముందుకు ప్రచారం చేసిన సినీ పెద్దలు గుణ ఎంత బతిమాలుకుంటున్నా రావటం లేదని సమాచారం. చిత్రంలో పనిచేసిన హీరో హీరోయిన్లు కూడా దర్శకుడి బలవంతం మేరకు మొక్కుబడిగా ఏదో ప్రమోషన్ కి వస్తున్నారే తప్ప... వారికి ఎలాంటి ఇంట్రస్ట్ లేదని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే గుణకి ఫిల్మ్ నగర్ లో పెద్దగా సత్సంబంధాలు లేకపోవటం కూడా మరో కారణంగా తెలుస్తుంది. అందుకే ఇన్ని సార్లు వాయిదాలు పడుతూ వస్తున్న ఈ చిత్రం చివరికి రేపు కూడా విడుదలయ్యేది అనుమానంగానే ఉండేది. అయితే చివరగా జరిగిన సమావేశంలో ఆక్రోశం వెల్లగక్కుతూ గుణ కంటతడి పెట్టాడట. దీంతో బహిరంగ విమర్శలు రాకముందే చిత్రానికి క్లియరెన్స్ ఇస్తే బెటర్ అని వారు భావించి చివరికి విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. భారీ విజువల్స్ తో హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తీసిపోని 3డి చిత్రమైన రుద్రమదేవీ స్క్రీన్ మీద ఎలా సందడి చేస్తుందో, గుణశేఖర్ భవితవ్యం ఏమిటో మరి కొద్ది గంటల్లో తేలనుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ