బర్త్ డే స్పెషల్: దర్శకధీరుని పుట్టిన రోజు నేడు

October 10, 2015 | 01:56 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Rajamouli-birth-day-today-nihaonline

తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్ళిన పరాజయం ఎరుగని దర్శకుడు రాజమౌళి పుట్టిన రోజు నేడు. ఇప్పటి వరకూ తెలుగులో ఏ దర్శకుడూ చేయని సాహసం 250 కోట్ల బడ్జెట్ తో జానపద చిత్రం ‘బాహుబలి’ని రూపొందించి ఓ ప్రాంతీయ భాష చిత్రాన్ని దేశదేశాల్లో ప్రదర్శించేలా చేశాడు. ఇప్పటి వరకూ తాను దర్శకత్వం వహించిన ప్రతి సినిమానూ సక్సెస్ చేస్తూ తెలుగు దర్శకుల్లో నెంబర్ వన్ దర్శకుడిగా ప్రశంసలందుకుంటున్నాడు. 
    తెలుగు సినీ కథారచయిత కె.విజయేంద్ర ప్రసాద్ కుమారుడైన కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి  మొదట సినిమా ఇండస్ట్రీకి రాఘవేంద్ర రావు శిష్యుడిగా ఎంటరయ్యాడు. మొదట దర్శకేంద్రుని ఆధ్వర్యంలో శాంతి నివాసం అనే సీరియ్ దర్శకత్వ బాధ్యతల్ని చేపట్టాడు. ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెం.1 చిత్రం ఆయన మొదటి చిత్రం. తరువాత సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్క, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి వంటి సినిమాలను తీసి, ఏ సినిమాకూ బాక్సాఫీస్ వద్ద తిరుగులేదన్న క్రెడిట్ దక్కించుకున్నాడు. మగధీర సినిమా పెద్ద సక్సెస్ తరువాత సునీల్ తో మర్యాద రామన్న చేసి సక్సెస్ చేయడమనేది ఈ దర్శకుడికే సాధ్యపడింది.  ప్రేక్షకులకు నచ్చేలా, విమర్శకులు మెచ్చేలా సినిమాలు చేయడం జక్కన్న తెలివిగా ఫాలో అవుతున్న స్ట్రాటజీ.
     ఇప్పటి వరకూ ఆయన ఎన్నో విభిన్న కథాంశాలను ఎంచుకున్నాడు. ఓ సినిమాలో రగ్భీ అనే ఆటను తీసుకుని చాలా ఆసక్తిగా కథ నడిపారు. పునర్జన్మ నేపథ్యంలో ఒక రాజులకథను జోడించి మగధీర, రాయల సీమ పగతో కామెడీ జోడించి మర్యాద రామన్న, యముడితో యమదొంగ, హీరోను పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూపిస్తూ, హృదయం ద్రవించే సెంటిమెంట్ తో విక్రమార్క సినిమా... ఇక ఒక ఎక్స్ ప్రెషన్ లేని హీరోతోనే కాదు ఈగను కూడా హీరోగా పెట్టి  సినిమా చేయడం... రాజమౌళికే చెల్లింది.  ఇలా... ఎలాంటి సినిమా అయినా తనదైన శైలిలో ప్రేక్షకులను నచ్చే విధంగా తీయడంలో ధిట్ట రాజమౌళి. 
      నటులనుంచి నటనను రాబట్టుకోవడంలో ఈయన పంథానే వేరు... లొకేషన్లో ఓ డైరెక్టర్ గా కాకుండా కెమేరా మేన్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా, ఆర్ట్ డైరెక్టర్ గా చివరికి లైట్ బాయ్ అవతారం కూడా ఎత్తేస్తాడు. అవసరమైతే ఈయనే హీరోలో పరకాయ ప్రవేశం చేసి అన్నీ ఆయనే అయి చేస్తుంటాడు. సై లో ఓ కాలేజీ స్టూడెంట్ లా వేణుమాధవ్ బెదిరిస్తుంటే అన్నా... అంటూ రెండు నిమిషాలు కనిపించి...ఆ సీన్ బుల్లి తెర మీద ఎప్పుడు వచ్చినా కళ్ళు తిప్పుకోనీకుండా చేసేశాడు ఈ డైరెక్టర్.  ఇక బాహుబలిలో అయితే కల్లు కాంపౌండ్ లో దర్శనమిచ్చి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచాడు.  లొకేషన్లో ఆయనో పని రాక్షసుడిలా కనిపిస్తాడు. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ఆయన సినిమాలో చిన్న పాత్ర ఇచ్చినా చాలని భావిస్తోందంటే... ఆయన గొప్పదనం ఇట్టే అర్థమైపోతోంది. 

దాదాపు తెలుగులో ఉన్న అందరు హీరోలతోనూ చేసిన రాజమౌళి మహేష్ బాబుతో మాత్రం ఇప్పటి వరకూ ఒక్క సినిమా కూడా చేయకపోవడం ఆయన అభిమానులకు లోటుగా కనిపిస్తోంది. బాహుబలి తరువాత ఓ సినిమా ఉంటుందని వార్తలు వచ్చినప్పటికీ అఫీషియల్ గా ఎలాంటి వార్తలూ రాలేదు. సీనియర్ నటులను పక్కన పెడితే రాజమౌళి అల్లు అర్జున్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లతో సినిమా చేయలేదు. ఇక ముందు వీరితో సినిమాలు  చేస్తాడా? అనేది అభిమానులకు ఓ క్వెశ్చన్ మార్కు. ప్రస్తుతం ఆయన చేతిలో బాహుబలి ది కంక్లూజన్ రెడీగా ఉంది. ఇక ఈ సినిమా అయిపోయాకే మరేదైనా ప్రాజెక్టు ఎనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. 

ఇక ముందు కూడా ఈ దర్శకధీరుడి నుంచి మరెన్నో మంచి సినిమాలు రావాలని కోరుకుంటూ...నీహార్ ఆన్ లైన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతోంది.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ