ఎన్నాళ్ళ నుంచో ఊరిస్తూ వచ్చిన బాహుబలి సినిమాను చూడాలని చిన్నా పెద్దా అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులైతే మొదటి షో నే చూడాలని పోటీలు పడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా టికెట్లు దొరకక అభిమానులు తెగ బాధ పడిపోతున్నారు. టికెట్ దొరికితే చాలు ఎంతైనా ఇచ్చి కొనాలన్నంత అతృతలో ఉన్నారు. కనీసం వారం రోజుల తర్వాతనైనా ఒక్క టికెట్టు దొరక్కపోద్దా అని టికెట్ల క్యూల్లో నిల్చుంటున్నారు. కానీ వారం రోజుల వరకు కూడా హౌస్ ఫుల్ బుకింగ్ నడుస్తోంది.. ప్రస్తుతం ‘బాహుబలి’ సినిమా టికెట్లకు అభిమానులు పలు సినిమా థియేటర్ల వద్ద భారీగా క్యూ కట్టారు. ఇక బ్లాక్ టికెట్ల రేట్లు మరీ ప్రియమయ్యాయి. ఒక్కొక్క టికెట్ ధర 2వేల నుంచి మొదలయ్యాయి.
అయితే టికెట్లను బ్లాక్ లో అధిక ధరలకు అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ లోని కెపిహెచ్‌బి పోలీసులు అరెస్టు చేసారు. కూకట్‌పల్లిలోని విశ్వనాథ్ థియేటర్ వద్ద వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుండి 797 టికెట్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేసారు. బాహుబలి మూవీ ఈ నెల 10న విడుదలవుతున్న నేపథ్యంలో భారీగా బ్లాక్ టికెటింగ్ జరుగుతుందన్న సమాచారం అందుకున్న పోలీసులు ఈ విషయమై నిఘా పెట్టారు. కూకట్ పల్లిలో రెండు సినిమా హాళ్లలో జులై 9న అర్థరాత్రి దాటాక ఒంటి గంట నుండి జులై 10 తెల్లవారు ఝామున 5 గంటలకు బాహుబలి సినిమా స్పెషల్ షోస్ వేస్తున్నారు. ఈ స్పెషల్ షోలకు సంబంధించిన టికెట్లు రూ. 2000 నుండి 3000 వరకు అమ్ముతున్నారు. ఇప్పటికే కూకట్ పల్లి పోలీసులు రెండు థియేటర్ల మేనేజర్లకు బ్లాక్ లో టికెట్స్ అమ్మవద్దని, రాత్రి ఒంటి గంట నుండి ఉదయం 5 గంటల మధ్య షోలు వేయవద్దని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే రెండు థియేటర్ల మేనేజర్లు తమకు స్పెషల్ స్క్రీనింగుకు అనుమతి ఉందని, ఈ స్పెషల్ షోలకు సంబంధించిన టికెట్లను డిస్ట్రిబ్యూటర్లే నేరుగా అమ్ముతున్నారని చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. విశ్వనాథ్ థియేటర్ వద్ద దాడి చేసి బ్లాక్ లో బాహుబలి టికెట్లు అమ్ముతున్న సుబ్రహ్మణ్యేశ్వర్, నితీష్ లను అదుపులోకి తీసుకుని 797 టికెట్లను సీజ్ చేసినట్లు తెలుస్తోంది. కాగా బ్లాక్ టికెటింగ్ అడ్డుకున్న పోలీసుల చర్యపై సామాన్య ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.