ప్రకాష్ రాజ్ లో ఎంత మంచి నటుడున్నాడో, వైవిద్యంగా ఆలోచించగల అంత మంచి డైరెక్టరూ ఉన్నాడు. ఆయనకు డైరెక్షన్ చేయాలన్న కోరిక చాలా బలంగా ఉన్నట్టుంది. అందుకే నటుడిగా ఇంత బిజీగా ఉన్నా డైరెక్టర్ గా కూడా నిరూపించుకోవాలనుకుంటున్నాడు. అతని డైరెక్షన్ లో వచ్చిన ‘ఉలవచారు బిర్యానీ’ (తెలుగు, తమిళ భాషల్లో) బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేదు. అయినప్పటికీ ఇదే సినిమాను హిందీలో తీయాలనుకుంటున్నాడు. ఇందులో ఆయన చేసిన క్యారెక్టర్ ను నానాపాటేకర్ తో చేయిస్తున్నాడట. ఓ విధంగా ఈ నటులిద్దరికీ అవినాభావ సంబంధం ఉంది. బాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నానా పాటేకర్ కు ఎంతపేరుందో, దక్షిణాదిలో ప్రకాష్ రాజ్ కూ అంతే పేరుంది. ఇద్దరూ అన్ని రకాల పాత్రలూచేయగలరు. అయితే నానాపాటేకర్ కు ప్రకాష్ రాజ్ అంటే చాలా అభిమానమట. ఆయన డైరెక్షన్ లో వచ్చిన ‘ఉలవచారు బిర్యానీ’ చాలా నచ్చిందట, ఆయన డైరెక్షన్ చాలా బాగుందని మెచ్చుకుని ఈ సినిమా చేయడానికి అంగీకరించినట్టు వార్తలు వినవస్తున్నాయి. ప్రకాష్ రాజ్ బాలీవుడ్ ఉలవచారు బిర్యానీ అయినా టేస్టీగా ఉంటుందేమో వేచి చూద్దాం.