విలక్షణ చిత్రాలకు మారుపేరైన కమల్ హాసన్ చేస్తున్న మరో విలక్షణమైన చిత్రం ‘ఉత్తమవిలన్’.తిరుపతి బ్రదర్స్ ఫిల్మ్ మీడియా ప్రై.లి., రాజ్‌కమల్ పిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్స్‌పై ఈరోస్ ఇంటర్నేషనల్ సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. తెలుగు ప్రేక్షకులకు సి.కె.ఎంటర్‌టైన్మెంట్స్ ప్రై.లి.బ్యానర్‌పై సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు. రమేష్ అరవింద్ దర్శకుడు. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మార్చి 28న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగింది. ఈ కార్యక్రమంలో కమల్ హాసన్, గౌతమి, కె.విశ్వనాథ్, ఎస్.పి.బాలసుబ్రమణ్యం, శృతిహాసన్, పూజాకుమార్, సి.కళ్యాణ్, రమేష్ అరవింద్, జిబ్రాన్ తదితరులు పాల్గొన్నారు. థియేట్రికల్ ట్రైలర్‌ను శృతిహాసన్ మొబైల్ ద్వారా విడుదల చేసింది. పాటలను నిర్మాత సి.కళ్యాణ్ మొబైల్ ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా...
కమల్‌హాసన్ మాట్లాడుతూ ‘‘ఉత్తమవిలన్ సినిమాలో అన్నీ ఎమోషన్స్ ఉంటాయి. జిబ్రాన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. తప్పకుండా సినిమా అందరికీ నచ్చే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అవుతుంది’’ అన్నారు.
కె.విశ్వనాథ్ మాట్లాడుతూ ‘‘కమల్‌తో యాక్ట్ చేయడం, అతన్ని డైరెక్ట్ చేయడం చాలా కష్టం. ఆ పని నేను చేశాను. అయితే బాలచందర్‌గారి దగ్గర శిష్యరికం చేయాలనే కోరిక మాత్రం మిగిలిపోయింది. బాలచందర్ గారి దగ్గర కనీసం వారంరోజులైనా శిష్యరికం చేయాలనుకున్నాను. కానీ కుదరలేదు. అదే విషయాన్ని ఉత్తమవిలన్ షూటింగ్ టైమ్ లో ఆయనకి చెబితే పెద్ద డైరెక్టర్ అయ్యావు తమాషా చేస్తున్నావా అని అన్నారు. కమల్ హాసన్ కారణంగా ఆయనతో ఈ ఉత్తమవిలన్ చిత్రంలో నటించే అవకాశం కలిగింది. కమల్ డైరెక్టర్స్ హీరో. ఏ రోల్ అయినా చేయగలడు’’ అన్నారు.
ఎస్.పి.బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ ‘‘నేను, కమల్ ఎప్పుడూ ఒకటే. నన్ను అన్నయ్య అని పిలిచే అతి కొద్దిమందిలో కమల్ ఒకడు. తనకి నేను 120 సినిమాలకు తెలుగులో డబ్బింగ్ చెప్పాను. తను నాకు ఎప్పటికీ ప్రత్యేకమైన వ్యక్తి. తను ఏదీ చేసినా నాకు ఎక్స్‌టార్డినరిగానే ఉంటుంది. ఈ విషయం చాలా మందికి తెలుసు. ఇండియన్ సినిమాలో కమల్ చేసిన, చేయబోయే ఎక్స్ పెరిమెంట్స్ మరెవరూ చేయలేరు. నభూతో నభవిష్యత్’ అన్నారు.
రమేష్ అరవింద్ మాట్లాడుతూ ‘‘కమల్‌హాసన్‌గారు కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్. ఈ సినిమాలో ఏమోషన్స్ అన్నీ ఉంటాయి. అలాగే కామెడి కూడా ఉంటుంది. ఈ సినిమాలో మ్యూజికల్ ఎక్స్ పెరిమెంట్ ఒకటి చేశాం. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీయే కాదు అన్నీ రకాల ఏమోషన్స్ ఉన్న మ్యూజికల్ ఎంటర్ టైనర్ కూడా అన్నారు.
గౌతమి మాట్లాడుతూ ‘‘కమల్ స్వాతిముత్యం, సాగర సంఘమం తర్వాత అలాంటి మూవీ రాలేదు. ఎప్పుడు వస్తుందా అని నేను కూడా అడిగాను. ఉత్తమవిలన్ సినిమాతో ఆ కోరిక తీరిపోతుందనే నమ్మకం కలుగుతుంది‘‘ అన్నారు.
శృతిహాసన్ మాట్లాడుతూ ‘‘నాన్నగారి సినిమా ఆడియో ఫంక్షన్‌కి రావడం గర్వంగా ఉంది. ఈ సినిమాని నేను చూశాను. యూనిక్ ఫిలిమ్. జిబ్రాన్‌గారు అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. రమేష్ అరవింద్‌గారి సహా నటీనటులు, టెక్నిషియన్స్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
ఎన్.లింగుస్వామి మాట్లాడుతూ ‘‘ఈ సినిమా స్టార్ట్ చేసిన నేను ఎప్పుడూ టెన్షన్ పడలేదు. ఎందుకంటే కమల్ గారికి సినిమా గురించిన ప్రతి చిన్నవిషయం తెలుసు. అందుకే నేను సెట్స్ లోకి కూడా వెళ్లలేదు. ఈ వేడుకకి ఆయన అభిమానిగా వచ్చాను. కమల్ హాసన్ గారి టాప్ టెన్ మూవీస్ లో ఇది ఒకటిగా నిలుస్తుందని రమేష్ అరవింద్ గారు భరోసా ఇచ్చారు. మా బ్యానర్ విలువను పెంచే చిత్రమవుతుంది. అందరిలాగానే నేను కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను’’ అన్నారు.
సి.కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా నాకు దొరికిన అక్షయ పాత్ర. కమల్‌గారితో సినిమా చేయడమంటే ఏ నిర్మాతకైనా దేవుడు వరమిచ్చినట్లే. నలుగురు పద్మశ్రీలు కలిసి చేసిన సినిమా ఇది. కమల్‌గారి సినిమా ఎలా ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకునే విధంగా సినిమా ఉంటుంది. డెఫనెట్‌గా బిగ్గెస్ట్‌హిట్ మూవీ అవుతుంది’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో టి.సుబ్బరామిరెడ్డి, బెల్లంకొండ సురేష్, సి.వి.రావు, పూజాకుమార్,ఎస్.వి.కృష్ణారెడ్డి, కె.అచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.