గతేడాది కొనసాగిన చిత్రాల వాయిదా పర్వం ఇప్పుడు మళ్లీ కొనసాగుతుంది. మే లో విడుదల కావాల్సిన కిక్ 2 ఆగష్టులో రిలీజ్ అయ్యి అట్టర్ ఫ్లాప్ కావటం, అదే టైంలో రావాల్సిన రుద్రమదేవీ కూడా గ్రాఫిక్స్ కారణంతో లేట్ అయి అక్టోబర్ 9కి షిప్ట్ కావటం తెలిసిందే. దీంతో చిత్రంపై కాస్త నెగటివ్ ప్రభావం జనాల్లో నెలకొంది. కారణాలేవయినా చిత్రాల పోస్ట్ పోన్ హైప్ పెంచుతుంది అనటం కంటే మొదటికే మోసం వచ్చే పరిస్థితులు పుష్కంగా ఉన్నాయి.
తాజాగా వరుణ్ తేజ్ హీరోగా సంచలన దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో కంచె చిత్రం తెరకెక్కింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన ఓ ప్రేమకథ అధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. దాదాపు 21 కోట్ల బడ్జెట్ తో కంచె రూపుదిద్దుకుంది. అయితే చిత్ర నిర్మాణం దగ్గరి నుంచి చివరికి మొన్నామధ్య ఆడియో పంక్షన్ దాకా జరిగిన అన్ని ప్రెస్ మీట్ లలో ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 2న విడుదల చేస్తామని ప్రకటించారు. పోస్ట్ పోన్ అయ్యే చాన్సే లేదని వరుణ్ తోపాటు చిత్ర యూనిట్ కూడా ధీమాగా చెప్పింది.
కానీ, ఈ చిత్రం అనుకున్న తేదీకి విడుదల కావట్లేదని ఇప్పుడు సమాచారం. బడ్జెట్ కు తగ్గ బిజినెస్ జరగకపోవటంతోనే ఈ చిత్ర విడుదలను వాయిదా వెయ్యాలని నిర్మాతలు భావిస్తున్నారని సమాచారం. క్లాసిక్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఎప్పుడు విడుదల చేసిన హిట్ అయ్యి తీరుతుందని, కాబట్టి చిత్ర విజయానికి ఎటువంటి ఢోకా లేదని నిర్మాతలు కాన్ఫిడెన్స్ తో ఉన్నారుట. అక్టోబర్ 30నగానీ, నవంబర్ 6న గానీ ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. జాప్యం వల్ల బిజినెస్ పరంగా ఏమో గానీ, తేడా కొట్టే పరిస్థితులు కూడా ఉంటాయ్ సుమీ.