రాంగోపాల్ వర్మ ఇలాంటి సినిమాలు తీయడంలో ఆయనకాయనే సాటి. అండర్ వరల్డ్ డాన్ సినిమాలు ఎన్నో చేసి సక్సెస్ సాధించిన హిస్టరీ ఉన్న డైరెక్టర్ ఈయన. శివతో మొదలైన ఈయన హిట్ చిత్రాల నేపథ్యం ఆ తరువాత సత్య, గాయం, రక్త చరిత్ర వంటి హిట్లిచ్చిన ఈ డైరెక్టర్ ఆయన సినిమాలతో జనాల మనసుకు గాయం చేసేస్తుంటాడు. ఇప్పుడు చందనం చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవితచరిత్రనే తెరకెక్కించే సాహసం చేస్తున్నాడు. విచిత్రం ఏమిటంటే ఈ స్మగ్లర్ రాజ్ కుమార్ ను కిడ్నాప్ చేసి, విడిచి పెడితే, ఆయన కుమారుడు శివరాజ్ కుమార్ ఇందులో వీరప్పన్ ను అంతమొందించే పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడు.
ఈ రోజు ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసి ట్వీట్ చేశాడు వర్మ. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను కూడా అభిమానులతో పంచుకున్నారు. ట్రైలర్ చూస్తే మునుపటి వర్మ మళ్ళీ గుర్తుకు వస్తున్నాడు. ఈ సినిమా టేకింగ్ లో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపిస్తోంది. ట్రైలర్ సినిమా కోసం ఎదురు చూసేలా చాలా ఆసక్తి రేపుతోంది. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రం ట్రైలర్-2ను వీరప్పన్ మృతి చెందిన రోజు అదే సమయానికి అంటే.. ఈ నెల 18న రాత్రి 10.40 గంటలకు విడుదల చేయనున్నట్లు రామ్‌గోపాల్‌వర్మ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
నవంబర్ 6న ఈ చిత్రం విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. పరుల్ యాదవ్, యజ్ఞ శెట్టి హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఢిల్లీకి చెందిన సందీప్ భరద్వాజ్ వీరప్పన్ పాత్ర పోషిస్తున్నాడు. వీరప్పన్ గురించి తెలుసుకున్న తర్వాత మాఫియా గ్యాంగ్‌స్టర్ మర్డర్స్ లాంటివి చిన్న పిల్లల ఆటలా కనిపించాయని వర్మ తెలిపాడు. ఒసామా బిన్ లాడెన్ కన్నా శక్తిమంతుడైన వీరప్పన్ ఎంతో మంది పోలీసులను, అడవి జంతువులను చంపి తిరుగులేని క్రిమినల్‌గా అవతరించాడని వర్మ చెప్పుకొచ్చాడు. అలాంటి క్రిమినల్‌ను చంపిన పోలీస్ కథే ‘కిల్లింగ్ వీరప్పన్'గా వర్మ తెలిపాడు. ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ వీరప్పన్‌ను చంపే ఆఫీసర్‌గా నటించటంతో జనాల్లో మరింత ఆసక్తి కలుగుతోందని వర్మ గతంలో చెప్పుకొచ్చారు. మొదటి ట్రైలర్ ఎంతో ఆసక్తిగా ఉండడంతో మరి రెండు రోజుల్లో వచ్చే మరో ట్రైలర్ కోసం మరింత ఎగ్సైటింగ్ గా ఎదురు చూస్తే పరిస్థితి కలిగిందిప్పుడు.