వేణు నటించిన సినిమాల్లోంచి కామెడీ క్లిప్పింగ్స్ చూస్తే ఒక రోజంతా నవ్వుకోవచ్చు. అందరినీ తన కామెడీతో అంతలా నవ్వించిన వేణు మూడునాలుగేళ్ళుగా సినిమాల్లో కనిపించడం తగ్గింది. గతేడాది ఒక్క సినిమాలో కూడా నటించలేదు. మనిషి ప్రస్తుతం చాలా సన్నబడ్డాడు. అతని పరిస్థితి చూసిన కొందరు ఏదో జబ్బు పడ్డాడని అనుకుంటున్నారట. అయితే ఈ వార్తలు చెవిన పడ్డా మౌనంగా ఉన్న వేణు మాధవ్ చివరికి నోరు విప్పారు. తన ఆరోగ్యం వస్తున్న వార్తలను ఖండించారు. తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని, తన గురించి లేని పోని పుకార్లు పుట్టించవద్దని విజ్నప్తి చేశాడు. ‘‘ఆర్టిస్టులుగా మేం రకరకాల ప్రాంతాలు తిరుగుతాం. చాలా రకాల పదార్థాలు తింటుంటాం. రకరకాల నీళ్లు తాగుతాం. అప్పుడప్పుడు ఆరోగ్యం దెబ్బతినడం మామూలే. నా గురించి వస్తున్న రూమర్లు తెలిసి బాధపడ్డాను. నేను ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తున్నాను. నన్ను త్వరగా దేవుడి దగ్గరకు పంపాలని చూడకండి. నేనింకా చాలా సినిమాలు చేయాలి. రాజకీయాల్లోకి వెళ్లాలి. ఇంకా చాలా ప్రణాళికలు ఉన్నాయి. నా కలలన్నీ నెరవేర్చుకుంటాను’’ అని వేణుమాధవ్ వివరించారు.