మెగాస్టార్ చిరంజీవి-లేడీ మెగాస్టార్ విజయశాంతి. 90వ దశకంలో ఇదో క్రేజీ జంట. వీరిద్దరి కాంబినేషన్లో ఓ చిత్రం వస్తుందంటే అంచనాలు ఎక్కడో ఉండేవి. డాన్సులు, రొమాన్స్, కామెడీ కలగలిపి ఈ జంట అలరించిన చిత్రాలు ఎన్నో. అయితే కారణం ఏంటో తెలీదుగానీ, ఆ తర్వాత వీరిద్దరి మధ్య పొరపచ్చాలు వచ్చి విడిపోయారు. ఆపై ఏ చిత్రాల్లోనూ కలిసి నటించలేదు. కానీ, వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలన్నీ ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల మదిలో మెదులుతుంటాయి. ఆ కోవలోనిదే గ్యాంగ్ లీడర్. చిరు మాస్ ఇమేజ్ ను అమాంతం పెంచుతూ తెలుగు చలన చిత్ర రికార్డులను తిరగరాసిన ఈ చిత్రం నేటికి సరిగ్గా పాతికేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా విజయశాంతిని పలకరించిన మీడియాతో ఎన్నో విషయాలు పంచుకున్నారు.
తన కెరీర్ లో గ్యాంగ్ లీడర్ ఓ ప్రత్యేక చిత్రం. అలాగే చిరంజీవిగారి లాంటి నటుడు మరోకరు ఉండరు. అసలు కొన్ని విషయాల్లో చిరంజీవికి సాటి రాగల వ్యక్తులు ఇప్పటికీ లేరు అంటున్నారామె. 'డ్యాన్సులు చేయడంలో ఇప్పటికీ చిరంజీవిని ది బెస్ట్ అనాల్సిందే. ఇండియాలోనే బెస్ట్ డ్యాన్సర్ ఆయన. చిరంజీవికి పోటీ రాగల వాళ్లు టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా ఇప్పటికీ లేరు. ఈ తరంలో కొంతమంది హీరోలు డ్యాన్సులు బాగానే చేస్తున్నా.. చిరంజీవిలో ఉన్న స్పెషల్ స్టైల్ వీరిలో కనిపించదు. సొంతగా ఆయనకు ఉండే గ్రేస్ స్పెషల్ అస్సెట్.' అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఈ చిత్రం కోసం భద్రాచలం కొండ పాట షూటింగ్ చేస్తున్న సమయంలో 'కర్తవ్యం' చిత్రానికి ఉత్తమనటి అవార్డు వచ్చినట్లు తెలిసిందట. ఆ సాయంత్రమే పెద్ద పార్టీ అరేంజ్ చేసి చిరు ఫ్యామిలీతో పాటు గోవిందా - దివ్యభారతిలను కూడా పిలిచారట చిరు. ఓ హీరోయిన్ కు అవార్డు వస్తే ఈ స్థాయిలో అభినందించడం ఆయన్నే చూశానంటున్నారు అప్పటి జ్నాపకాలను నెమరువేసుకుంది రాములమ్మ.