ఈ సారి మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా ఉన్నాయి. గత రెండు దఫాలు మురళీమోహన్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. కానీ ఈ సారి తనకు ఇతర కమిట్ మెంట్లు ఎక్కువగా ఉన్నాయని, రాజమండ్రి ఎంపీగా గోదావరి పుష్కరాల బాధ్యత కూడా తనదే కావడంతో మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్‌కు సేవలు చేయలేనని మురళీమోహన్ కచ్చితంగా చెప్పేశారు. దాంతో సీన్ లోకి రాజేంద్రప్రసాద్ వచ్చారు. గతంలో ఓ సారి ఈ పదవి కోసం రాజేంద్రప్రసాద్ పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఈ సారి ఆయన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాదంబరి కిరణ్, శివాజీరాజా బ్యాచ్ అంతా రాజేంద్రప్రసాద్ కు సపోర్ట్ పలికారు. కానీ అంతలో మంచు విష్ణు మా అధ్యక్ష పదవి కోసం పోటీపడనున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. మంచు వర్సెస్ రాజేంద్రప్రసాద్ అనే టాక్ బయటికి వచ్చింది. కానీ తనకిప్పుడు అధ్యక్ష పదవి మీద మోజు లేదని, తాను పోటీ పడుతున్నానని వచ్చిన వార్తల్లో నిజం లేదని విష్ణు తేల్చేశారు. దీంతో రాజేంద్రప్రసాద్ పదవి దాదాపు ఖరారైనట్టేనని, నామ్‌కే వాస్తుగా ఎన్నికలు జరుగుతాయని సమాచారం.