క్రికెట్ మాకియావెల్లికి వీడ్కోలు

September 21, 2015 | 10:36 AM | 1 Views
ప్రింట్ కామెంట్
BCCI-chairman-jagmohan-dalmia-died

ప్రపంచంలోనే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ను తిరుగులేని శక్తిగా తయారు చేసిన వ్యక్తి, అసలైన క్రికెట్ పండితుడు ఇకలేరు. బీసీసీఐ చైర్మన్ జగ్మోహన్ దాల్మియా ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత వారం గుండెనొప్పితో కోల్ కతాలోని బిర్లా మెమోరియల్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న బీసీసీఐ ని సుసంపన్నం చేసిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. 1940 మే 30న కోల్ కతాలో జన్మించిన ఆయన క్రికెట్ టీంకు వికెట్ కీపర్ గా పనిచేశారు. జగ్మోహన్ దాల్మియా మొదటగా బీసీఏ (బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌) అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తరువాత 1979లో బీసీసీఐ బోర్డులో సభ్యునిగా చేరారు. 1983లో బీసీసీఐలో కోశాధికారిగా పనిచేశారు. ఆ తరువాత 1997-2000 మధ్యకాలంలో ఐసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2001 నుంచి 2004 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు. మరల 2013లో కొంతకాలంపాటు బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు. దాదా గంగూలీికి లైఫ్ ఇచ్చింది ఈయనే. శ్రీనివాసన్ నిష్క్రమణతో తిరిగి బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన దాల్మియా గత ఆరు నెలలుగా తీవ్ర అనారోగ్యంతో ఏ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు.  భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును  కార్పొరేట్ సంస్థగా తీర్చిదిద్ది, ఐసీసీని ఛాలెంజ్ చేయగల సంస్థగా తీర్చిదిద్దడంలో  ఆయన పాత్ర విశిష్టమైంది. ఆయనను క్రికెట్ మాకియావెల్లిగా అభివర్ణిస్తారు. దాల్మియా ఆకస్మిక మరణంపై క్రికెట్ ప్రపంచం సంతాపం వ్యక్తం చేసింది. దాల్మియా మృతి భారత క్రీడా ప్రపంచానికి తీరని లోటని పలువురు అభివర్ణించారు. బీసీసీఐ అధ్యక్షుడిగా పలుమార్లు పని చేసిన దాల్మియా మృతికి బీసీసీఐ సంతాపం ప్రకటించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ