సచిన్ బయోపిక్ టీజర్ వచ్చేసింది

April 14, 2016 | 04:50 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Teaser-Of-Sachin-Tendulkars-Biopic-Is-Out-niharonline

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బయోపిక్ టీజర్ వచ్చేసింది. యూట్యూబ్‌లో విడుదల చేసిన ఈ టీజర్‌పై దేశవ్యాప్తంగా సెలబ్రిటీలు  చాలామంది రీట్వీట్ చేశారు. ఈ టీజర్‌లో చిన్నతనంలో సచిన్ తన తండ్రి వేలు పట్టుకుని వెళ్లడం, తొలిసారి బ్యాట్ పట్టుకున్న ఆనందం, అన్నతో కలిసి ఆడటం, స్కూల్లో తోటి పిల్లలతో కొట్లాటలు.. ఇవన్నీ ముందు కనిపిస్తాయి. తర్వాత బీచ్ ఒడ్డున తనకు ఎంతో ఇష్టమైన నీలిరంగు షర్టు వేసుకున్న సచిన్ కనిపిస్తాడు. ఆ తర్వాత మళ్లీ హెల్మెట్ పెట్టుకుని గ్రౌండులోకి వెళ్లడం, మిడిల్ వికెట్ మీద నాణెం పెట్టి ఆడటం, ఒళ్లంతా మూడు జెండా రంగులను పులుముకుని జెండా ఊపుతూ కనిపించే సచిన్ వీరాభిమాని సుధీర్.. ఇవన్నీ కూడా టీజర్‌లో జోడించారు. మధ్యలో తన తండ్రి చెప్పిన సందేశాన్ని కూడా సచిన్ వినిపించాడు. ''మా నాన్న ఎప్పుడూ చెప్పేవారు.. నువ్వు క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నావు. కానీ అది నీ జీవితంలో ఒక భాగం మాత్రమే. కానీ ఏదో ఒకటి మాత్రం శాశ్వతంగా నీతో ఉండిపోతుంది అది.. నీ వ్యక్తిత్వం'' అని సచిన్ టెండూల్కర్ చెప్పడం కూడా ఈ టీజర్‌లో కనిపిస్తుంది.

                           మొత్తంమ్మీద మైదానంలోనే కాదు వెండితెర మీద కూడా అభిమానులను అలరించేందుకు సచిన్ టెండూల్కర్ సిద్ధమయ్యాడు. ఇప్పటికే అజహార్, ధోనీ చిత్రాలు ఈ వరుసలో ఉండగా, సచిన్ జీవితంపై సినిమా వస్తుందని తెలియగానే ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని సంతోషిస్తున్నాడు. అన్నట్లు 'సచిన్' పేరుతో వస్తున్న ఈ సినిమాలో సచినే స్వయంగా నటిస్తున్నాడు. 'సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్' గా రాబోతున్న ఈ చిత్రానికి ప్రముఖ రచయిత, దర్శక, నిర్మాత జేమ్స్ ఎరిక్సన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ