ఆడితే కాదు... వాళ్లు ఓడితే వచ్చింది

January 18, 2016 | 12:12 PM | 1 Views
ప్రింట్ కామెంట్
India gets No 1 Test ranking after 5 years due to safari lost niharonline

ఆస్ట్రేలియా టూర్ లో 3-0 తో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియాకు కాస్త ఊరట కలిగించే విషయం. వన్డేలో తడబడుతున్నప్పటికీ తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ర్యాకింగ్ లో భారత్ నంబర్ వన్ పొజిషన్ కు చేరింది. 110 పాయింట్లతో సౌతాఫ్రికాను వెనక్కినెట్టి అగ్ర స్థానం కైవసం చేసుకుంది. అయితే ఇక్కడ మనోళ్ల గొప్ప ఏ మాత్రం లేదు.  సఫారీలను సొంత గడ్డపై క్లీన్ స్వీప్ చేసినా అగ్రస్థానం దక్కలేదు. అలాంటిది ఇప్పుడెలా దక్కిందంటే... ప్రస్తుతం ఇంగ్లాండ్ తో ఆడుతున్న దక్షిణాఫ్రికా జట్టు అక్కడా పరాజయం పాలైంది. వరుసగా మూడు టెస్టు మ్యాచ్ ల్లో ఓటమిపాలైన సఫారీలు, సిరీస్ ను ఇంగ్లండ్ కు సమర్పించుకున్నారు. ఈ నేపథ్యంలో మొన్నటిదాకా అగ్రస్థానంలో ఉన్న సఫారీ టెస్టు జట్టు కాస్తా, ఓ మెట్టు కిందకు దిగక తప్పలేదు. దీంతో రెండో స్థానంలో ఉన్న టీమిండియా అగ్రస్థానానికి ఎగబాకింది.

                          అయితే కారణం ఏదైతేనేం దాదాపు 5 ఏళ్ళ తర్వాత భారత్ తిరిగి టెస్ట్ లో టాప్ వన్ ర్యాంక్ ను కైవసం చేసుకుంది. కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని టీమిండియా 2011కు ముందు టెస్టు ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే 2011లో ఇంగ్లండ్ చేతిలో వరుసగా నాలుగు టెస్టులు ఓడిన టీమిండియా నాడు ఆ ర్యాంకును కోల్పోయింది. తాజాగా ఇంగ్లండ్ వీర విహారంతోనే సదరు టాప్ ర్యాంకు మళ్లీ భారత్ దరిచేరడం విశేషం. అయితే సౌతాఫ్రికా ఇచ్చిన ఈ బహుమతి ఎంతో కాలం ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే నాలుగో టెస్ట్ లో డ్రా అయినా, సౌతాఫ్రికా గెల్చినా ర్యాంకు తిరిగి వారికే చేరుతుంది. అంటే మన ర్యాంకు ఇంకొద్ది రోజులు ఉండాలంటే ఖచ్ఛితంగా సఫారీలు ఓడి తీరాలన్నమాట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ