క్రికెట్ కొత్త దేవుడు ఏబీ డివిలియర్స్

October 29, 2015 | 03:32 PM | 3 Views
ప్రింట్ కామెంట్
ab-de-villiers-next-sachin-to-cricket-niharonline

మైదానంలోకి ఎంతో మంది క్రికెటర్లు వస్తుంటారు పోతుంటారు. కానీ, కొందరు మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు. వారిని ఎప్పటికీ మర్చిపోలేం. దశాబ్దాలుగా దిగ్గజ క్రికెటర్లు అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేయడం చూస్తున్నాం. రంజిత్‌సింగ్‌జీ నుంచి గిల్బర్ట్‌ గ్రేస్‌, డొనాల్డ్‌ బ్రాడ్‌మన్‌, వాల్డర్‌ హ్యాడ్లీ, గ్యార్‌ఫీల్డ్‌ సోబర్స్‌ నుంచి వివియన్‌ రిచర్డ్స్‌, సచిన్‌ టెండూల్కర్‌ ఇలా.. ప్రతీ తరం నుంచి ఎవరో ఒకరు విశ్వవ్యాప్తంగా అభిమానుల గుండెలను గెలుచుకున్నారు. ఆటపై తమదైన ముద్ర వేశారు. అలాంటి ఆటగాళ్ల కోసం ప్రజలు స్టేడియాలకు పోటెత్తేవారు. వారి ఆటను చూసి తరించేవారు. వీరందిరిలోకి స్పెషల్ మాత్రం సచిన్ రమేష్ టెండూల్కర్. రింగుల జుత్తు.. మొహంపై ఇంకా పసిఛాయలు పోని యువకుడిగా.. క్రికెట్‌ మైదానంలోకి అడుగుపెట్టిన సచిన్‌ టెండూల్కర్‌.. తన ఆటతో పాటు స్వభావంతో కోట్లాది మంది ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. ‘క్రికెట్‌ దేవుడు’గా మారిపోయాడు. సచిన్ హైట్ తక్కువే కావొచ్చు కానీ ఆటలో మాత్రం ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. ‘ఒకవేళ క్రికెట్‌ నా మతమైతే. సచిన్‌ నా దేవుడు’ అని క్రీడాభిమానులు ఫిక్సయిపోయారంటే అర్థం చేసుకోవచ్చు మాస్టర్ అంటే ఎంత అభిమానమో.

సచిన్‌ శకం ముగిసిపోయింది. మరి మాస్టర్‌ తర్వాత ఎవరూ అంటే.. ప్రస్తుతం ఈ జాబితాలో వినిపిస్తున్న పేరు ఒకటే. ఏబీ డివిలియర్స్... అవును త్వరలోనే అతను ‘క్రికెట్‌ దేవుడి’గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మైదానంలో అద్భుత ప్రదర్శనలు చేస్తున్న ఏబీ ఘనతను కొనియాడేందుకు మాటలు సరిపోవడం లేదనడం అతిశయోక్తి కాదు. ఏబీ కేవలం గొప్ప క్రికెటర్‌ మాత్రమే కాదు.. అసాధారణ అథ్లెట్‌. ఆన్‌ఫీల్డ్‌లో డివిల్లీర్స్‌ విన్యాసాలు చూస్తే.. కామిక్‌ సినిమాల్లో సూపర్‌ హీరోల్లో ఒకడనిపిస్తుంది.

16 బంతుల్లో అర్ధ శతకం, 31 బంతుల్లో సెంచరీ, 64 బంతుల్లో 150 పరుగుల ఇన్నింగ్స్‌లు ఏబీ ఖాతాలో ఉన్నాయి. 2005లో అరంగేట్రం చేసిన డివిలియర్స్.. వన్డేల్లో 187 ఇన్నింగ్స్‌ల్లో 8400 పరుగులు కొల్లగొట్టాడు. అందులో 23 సెంచరీలు, 47 అర్ధ సెంచరీలు ఉన్నాయి. చాలా మ్యాచ్‌ల్లో జట్టును ఒంటిచేత్తో గెలిపించి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డులు గెలుచుకున్నాడు. ఏబీ సెంచరీ చేసిన మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా కేవలం మూడింట్లోనే ఓడిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. మరోవైపు టెస్ట్ లో కూడా 98 టెస్టులు ఆడిన డివిల్లీర్స్‌ ఒక డబుల్‌ సెంచరీ సహా 21 శతకాలు నమోదు చేశాడు. ఇక భారత్‌లో ఏబీ అద్భుతమైన రికార్డు.. సచిన్‌కు అతణ్ణి దగ్గరగా చేసింది. భారత గడ్డపై అతని వన్డే సగటు 70.31. ఇక్కడ ఆడిన 20 ఇన్నింగ్స్‌ల్లో ఏడు సెంచరీలు, మూడు అర్ధ శతకాలతో 1125 పరుగులు చేశాడు. వన్డేల్లో భారత గడ్డపై 70కి పైగా సగటు ఉన్న ఏకైక బ్యాట్స్‌మన్‌ అతనే. భారత్‌పై 24 సంవత్సరాల తర్వాత సఫారీలు వన్డే సిరీస్‌ నెగ్గడం ఏబీ చలవే అనడంలో సందేహం లేదు. డివిలియర్స్ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ అయినప్పటికీ.. వన్డేల్లో 25 ఓవర్ల తర్వాత బ్యాటింగ్‌కు దిగి ఐదుసార్లు శతకాలు నమోదు చేసిన తొలి ఆటగాడిగా ఘనత సాధించాడు.

విజయానికి విధేయుడిగా ఉండే డివిలియర్స్.. పరాజయానికీ గౌరవం ఇస్తాడు. ఆటలో డివిల్లీర్స్‌ రికార్డులు అద్భుతం. వన్డేల్లో అతని సగటు 54.21 కాగా, స్ట్రయిక్‌రేట్‌ 100.28 కావడం విశేషం. మిగతా కెరీర్‌నూ ఇదే స్థాయిలో కొనసాగిస్తే.. ఇలాంటి రికార్డు సాధించిన ఏకైక ఆటగాడిగా చరిత్రలో నిలిచిపోవటమే కాదు, సచిన్ తర్వాతి స్థానంలో నిలుస్తాడనటంలో ఎలాంటి సందేహం లేదు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ