టీమిండియా ఎక్కువగా యువ ఆటగాడు విరాట్ కోహ్లీపైనే ఆధారపడుతోందని మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచ కప్ టోర్నీలో విరాట్ కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడం టీమిండియాకు ఎంతో అవసరమని అన్నాడు. ‘భారత బ్యాటింగ్ లైనప్‌ను గమనిస్తే కోహ్లీ ఎంతో విలువైన ఆటగాడు. మధ్య ఓవర్లలో విరాట్ తోపాటు రైనా, ధోనీలు కూడా కీలకం. భారత్ ప్రపంచ కప్ నిలబెట్టుకోవాలంటే కోహ్లీ రాణించడం ఎంతో అవసరం' అని భారత మాజీ కెప్టెన్ ద్రావిడ్ అన్నాడు. భారత బౌలింగ్‌లోని లోపాలు ఆందోళన కలిగించే విషయమని ద్రావిడ్ తెలిపాడు. బౌలర్లు తమ ప్రదర్శనను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం చాలా ఉందని చెప్పాడు. కాగా, విరాట్ కోహ్లీ టీమిండియాకు కీలక ఆటగాడని విస్టిండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ అన్నాడు. విరాట్ కోహ్లీ ప్రస్తుత స్థానంలో బ్యాటింగ్ రావడం ఉత్తమమేనని చెప్పాడు. ప్రతిభ గల ఆటగాడు ఏ స్థానం నుంచి బ్యాటింగ్ చేసినా రాణిస్తాడని అభిప్రాయపడ్డాడు. ఈ ప్రపంచ కప్ టోర్నీలో విరాట్ కోహ్లీ భారత్ ఆశా కిరణమని చెప్పాడు.