అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలర్ల బౌలింగ్ వ్యవహార శైలిపై ఆరోపణలు రావటం వింటూనే ఉంటాం. అంతేకాదు బౌలింగ్ యాక్షన్ పై అంతర్జాతీయ, దేశీయ స్థాయిలో వేటుకు గురయిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇలా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు బౌలర్లు వరల్డ్ కప్ కు సిద్ధమవుతున్నారు. అయితే ఆటతీరు సందేహాస్పదంగా ఉన్న ఆటగాళ్ల పట్ల కఠినమైన వైఖరిని అవలంబిస్తూ నిర్వహించనున్న తొలి ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ ఇదే. వెస్టిండీస్, పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక, జింబాబ్వే దేశాలకు చెందిన ఈ ఆటగాళ్లు ఇప్పటికే పలుమార్లు సస్పెన్షన్లకు గురయ్యారు. అయినప్పటికీ ఆయా దేశాల క్రికెట్ బోర్డులు వారికి ప్రపంచకప్ బెర్తుల్లో చోటు కల్పించాయి. అయితే కఠిన వైఖరి అలంభిస్తూనే ఇటువంటి ఆటగాళ్లపై ఆటతీరుపై దృష్టి కేంద్రీకరించాల్సిందిగా అంపైర్లకు ప్రత్యేకంగా ఎటువంటి ఆదేశాలనూ జారీచేసేది లేదని ఐసీసీ అధికార ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఏ బౌలర్ అయినా అవకతవకలకు పాల్పడినట్లు ఫిర్యాదులు వస్తే అతడిని వెంటనే బ్రిస్బేన్ (ఆస్ట్రేలియా)లోని అధీకృత పరీక్షా కేంద్రానికి పంపించి పరీక్షిస్తారని తెలిపారు. సాధారణంగా ఫిర్యాదు అందిన తర్వాత 21 రోజుల వ్యవధిలోపు నిర్వహించే ఈ పరీక్షలను ఇకమీదట కేవలం వారం రోజుల వ్యవధిలోనే నిర్వహిస్తారు. పాకిస్థాన్ స్పిన్నర్ ఆజ్మల్, వెస్టిండీస్ టాప్ బౌలర్ సునీల్ నారాయణ్, మరో విండీస్ బౌలర్ మర్లాన్ శామ్యూల్స్, శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ సచిత్ర సేనానాయకే, న్యూజిలాండ్ పార్ట్‌టైమ్ ఆఫ్ స్పిన్నర్ కాన్ విలియమ్‌సన్‌పై, జింబాబ్వే సీనియర్ ఆటగాడు ప్రాస్పెర్ ఉసెయాతో పాటు బంగ్లాదేశ్ సీమర్ అల్ అమిన్ హుస్సేన్ బౌలింగ్ తీరు కూడా అక్రమంగా ఉన్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. వీరి బౌలింగ్ వ్యవహారశైలిపై ఏమన్నా అనుమానాలు కలిగితే మాత్రం ఇక వీళ్ల పని అంతే. శాశ్వతంగా క్రికెట్ కెరీర్ కే గండి పడే అవకాశం ఉంది.