పక్కింటి ఇళ్లల్లోకి వెళ్లి దొంగతనాలు చేయడమే కాకుండా, యజమాని పరువు తీసే వస్తువులను దొంగిలించి తీసుకొస్తోంది ఆ పిల్లి. ఆ పిల్లి చేసే పనులతో దాని యజమానికి మహా చిక్కొచ్చిపడింది. న్యూజిలాండులోని హమిల్టన్ లో జార్జ్ సెంటర్ ప్రాంతంలో సారా నాథన్ అనే మహిళ టాంకినీస్ జాతికి చెందిన ఓ పిల్లిని పెంచుకుంటోంది. దానికి ముద్దుగా బర్గలర్ అనే పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా చూసుకుంటుంది. అయితే అది మాత్రం దాని బుద్ధి పోనిచ్చుకోలేదు. రోజూ తెల్లవారగానే జార్జ్ సెంటర్ ప్రాంతంలో తిరుగుతోంది. యజమాని నిద్రనుంచి మేల్కొనే సరికి వీధిలోని పలువురి ఇళ్ల నుంచి అండర్ వేర్లు, సాక్సులు దొంగిలించి తీసుకొస్తోంది.
తిరిగి వాటిని ఆయా వ్యక్తులకు అప్పజెబుదామంటే అవి ఎవరివో తెలియక సారా బాగా ఆలోచించి చివరికి ఓ ఐడియా వేసింది. ఆ పిల్లిని కూర్చోబెట్టి, దాని ముందు అది దొంగిలించి తీసుకువచ్చిన 11 జతల అండర్ వేర్లు, యాభై సాక్సులు పెట్టి... ఓ ఫోటో తీసి, 'జార్జ్ సెంటర్ లో ఇవి పోగొట్టుకున్న వారు తన ఇంటికి వచ్చి తీసుకెళ్లవచ్చని' ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది. ఇదిప్పుడు వైరల్ గా మారింది. షేర్లు, కామెంట్లతో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.