ప్రతి మగాడి విజయం వెనకా ఒక స్త్రీ ఉంటుందనేది నానుడి. అలాగే ఏ ఉద్యోగం లేకుండా పనిపాటా లేకుండా తిరుగుతున్న తన ప్రియుడిని ప్రయోజకుడ్ని చేద్దామనుకుంది. అందుకోసం ఏ అమ్మాయి చేయని పనిచేసింది. మరీ దూరం వెళ్లకండి. ఆమె చేసిన పని నమ్మకద్రోహం. తాను పనిచేస్తున్న కంపెనీ రహస్యాలను బయటికి వెల్లడించి మరీ ప్రియుడ్ని కోటీశ్వరుడిని చేసింది. ప్చ్... అయితే ఏం లాభం. ఇప్పుడు అమెరికాలో పోలీసు కేసులను ఎదుర్కొంటోంది.
వివరాల్లోకి వెళితే... దొడ్డి షర్మిల అనే యువతి యూఎస్ లోని వేల్స్ అండ్ ఫార్గో సంస్థలో సిస్టమ్ అనలిస్టుగా పని చేస్తోంది. డెంటల్ సంస్థ 'అమెరికన్ డెంటల్ పార్ట్ నర్స్'తో 398 మిలియన్ డాలర్ల విలువైన డీల్ ను కుదుర్చుకునే దిశగా వేల్స్ అండ్ ఫార్గో అడుగులు వేస్తోంది. ఈ విషయమై ఎటువంటి వార్తా బయటకు రాని సమయంలో షర్మిల తన బాయ్ ఫ్రెండ్ వ్లాడ్ స్పివాక్ కు ఈ సంగతి చేరవేసింది. దీంతో అతను డెంటల్ సంస్థ వాటాలను కొనుగోలు చేశాడు. ఆపై ఇరు కంపెనీల మధ్యా డీల్ ప్రకటితం కాగా, ఆ సంస్థ ఈక్విటీ అమాంతం పెరిగింది. దీంతో స్పివాక్ కు 2.22 లక్షల డాలర్లు (సుమారు రూ. 14.4 కోట్లు) లాభం వచ్చింది.
ఈ విషయాన్నంతా గమనిస్తూ వస్తున్న సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ కమిషన్ అసలు కూపి లాగింది. దీంతో షర్మిలపై కేసు నమోదు చేసింది. కావాలనే సంస్థ వివరాలు బయటకు వెల్లడించిందని, ఆమెను తొలగించామని వేల్స్ ఫార్గో ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే, ఆమె స్వయంగా ఇన్ సైడర్ ట్రేడింగ్ లో పాల్గొనలేదు కాబట్టి భారీ జరిమానాతో సరిపెట్టవచ్చని న్యాయనిపుణులు భావిస్తున్నారు. నిరుద్యోగిగా ఉన్న తన బాయ్ ఫ్రెండ్ జీవితంలో నిలదొక్కుకోవాలని ఆమె ఆలోచన ఇప్పుడు కటకటాలపాలు జేసింది. అంతేకాదు సదరు ప్రియుడు ఈ గోలేం పట్టనట్లు మరో అమ్మాయిని వేసుకుని చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడట. నమ్మకద్రోహానికి మించిన నేరం మరోకటి ఉండదేమో కదా.