పనికి రానివి ఎన్ని ఉంటే ఏం లాభం... పనికొచ్చేది ఒక్కటి ఉంటే చాలు. రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదవా అంటారు. కానీ, ఆయనేమో మాజీ రాజుగారు అయిపోయారే. ఏమీ తలచుకోరేమో... ఆయనగారు ఎవరినీ కొట్టక్కర్లేదు కానీ.. బకాయి పడిన విద్యుత్ బిల్లు కట్టాలి. నేపాల్ దేశానికి చెందిన మాజీ రాజు జ్ఞానేంద్ర నేపాల్ ఎలక్ట్రిసిటీ సంస్థకు (ఎన్‌ఈఏ) అక్షరాలా 70,000 అమెరికన్ డాలర్లు బకాయిపడ్డారు. మన కరెన్సీలో అక్షరాల 47, 45, 366 రూపాయలు. ఇది ఆయన పదేళ్ల నుంచి కట్టని బిల్లు అట.
ఇక ఆయన నివసిస్తున్న ప్యాలెస్ కు అధికారులు విద్యుత్ బిల్లు పంపగా, దానిని చెల్లించేందుకు ఆయన నిరాకరించారట. ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయిన నేపాల్ విద్యుత్ సంస్థ వీటినుండి బయటపడాలంటే ఈయన బిల్లు కడితే చాలు. మాజీ రాజుగారి బిల్లుపైనే ఈ ఆశలు పెట్టకున్నామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం వారు నేపాల్ ప్రధానమంత్రి కార్యాలయాన్ని సంప్రదించనున్నారుట. దీని కోసం ప్రత్యేకంగా ఆయనకు నోటీసులు పంపాలని కోర్టును ప్రభుత్వం ఆశ్రయించనుంది. ఆయన బిల్లు కడితే చాలు విద్యుత్ బోర్డుకు కష్టాలు నష్టాలు లేకుండా పోతాయన్నమాట.