ఉగ్రవాదలు బలవంతం మీద ఇస్లామిక్ స్టేట్ ఫైటర్ గా మారి, వారి విధానాలు నచ్చక ఎలాగైనా బయటకు రావాలన్న ఉద్దేశంతో ఆత్మాహుతి దళంలో చేరాడో 14 ఏళ్ల బాలుడు. ఉసైద్ బర్హో అనే పేరున్న ఓ బాలుడు ఒంటి నిండా బాంబులు పెట్టుకొని భద్రతా దళాల దగ్గరికి వచ్చి లొంగిపోయాడు. ఇతని వద్ద ఐఎస్ కు సంబంధించిన ఎంతో సమాచారం లభించింది. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ వేళ్లానుకొకపూర్వం ఉసైద్ నిత్యం పుట్ బాల్ ఆడేవాడు. జాకీచాన్ సినిమాలు చూసేవాడు. డాక్టర్ కావాలన్నది అతని ఆశయం. పరిస్థితి మారి ఉగ్రవాద ప్రాబల్యం పెరిగిన తర్వాత, ఒక మసీదులో ఉన్న ఇతనికి కౌన్సిలింగ్ ఇచ్చి తమలో చేర్చుకున్నారు ఐఎస్ ఉగ్రవాదులు. షియాలపై యుద్ధం చేయకుంటే, వారు వచ్చి ఆ అబ్బాయి తల్లిని అత్యాచారం చేస్తారని బెదిరించారు. దీంతో ఉసైద్ వారిలో చేరాల్సి వచ్చింది. అయితే చేరాక అక్కడి పరిస్థితి తెలుసుకోడానికి అతనికి ఎంతో టైం పట్టలేదు. ఎలాగైనా తప్పించుకోవాలని భావించి అందుకు ప్రాణాంతక మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆత్మాహుతి దళంలో చేరతానని ఉగ్ర పెద్దలకు చెప్పగా, వారు వెంటనే అంగీకరించారు. బాలుడికి పేలుడు పదార్థాలు ఉన్న జాకెట్ తొడిగి బాగ్దాద్ లోని షియా మసీదు వద్దకు పంపారు. అక్కడికి చేరుకున్న ఉసైద్ భద్రతా దళాలకు లొంగిపోయాడు. ప్రస్తుతం అతన్ని గుర్తుతెలియని ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నారు.