విషాదకర రీతిలో మృతి చెందిన ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిలిప్ జోయల్ హ్యూస్ అంత్యక్రియలు భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 10.10 ని. లకు నిర్వహించారు. అంత్యక్రియలకు ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్, ఆస్ట్రేలియన్ క్రికెటర్లతోపాటు భారత్ జట్టు తరపున రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పాల్గొన్నారు. మాక్స్‌విలే హైస్కూల్ స్పోర్ట్స్ హాల్‌లో అంతిమ సంస్కారాల కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, ఆసీస్ క్రికెటర్లతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. నవంబర్ 27న ఓ దేశీవాళీ మ్యాచ్ ఆడుతుండగా బంతి తగిలి హ్యూస్ మృతి చెందిన విషయం తెలిసిందే. తొలుత క్రికెటర్లు హ్యూస్‌కు 'గార్డ్ ఆఫ్ ఆనర్' సమర్పించారు. ఆ తర్వాత హ్యూస్ పార్థివ దేహాన్ని మాక్స్‌విలేలో ఊరేగించారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ హాల్‌కు హాజరైన ప్రతి ఒక్కరూ గ్రామంలోని వీధుల వెంబడి వరుసగా నిలబడి హ్యూస్‌కు కన్నీటితో ప్రత్యేక వీడ్కోలు పలికారు. మాక్స్‌విలేలో ప్రసిద్ధి చెందిన 'టైలర్స్ ఆర్మ్ హోటల్'కు కొద్ది దూరంలో హ్యూస్ ఎంతో ఇష్టపడి కొనుకున్న వ్యవసాయం క్షేత్రం 408లో క్రికెటర్ దేహాన్ని ఖననం చేశారు.