సునంద పుష్కర్ హత్య కేసులో ఆమె భర్త శశిథరూర్ పై అనుమానాలు రోజురోజుకీ బలపడిపోతున్నాయి. సునంద మృత దేహానికి శవపరీక్ష చేసిన వైద్య బృందానికి నేతృత్వం వహించిన ఎయిమ్స్ వైద్యుడు సుధీర్ గుప్తాకు థరూర్ తరచు మెయిళ్లు పంపాడనే వార్త షాక్ కి గురిచేస్తోంది. అసలు గుప్తా ఇచ్చిన నివేదిక ఆధారంగానే పోలీసులు సునంద మరణాన్ని హత్య కేసుగా మార్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ డీసీపీ కుష్వాహా నేతృత్వంలో నిర్వహించిన విచారణలో గుప్తా ఈ కీలక సమాచారాన్ని అందించారంట. పోలీసులు కూడా సదరు సందేశాలను పరిశీలించినట్లు సమాచారం. అసలు శవపరీక్ష చేసిన వైద్యుడికి సందేశాలు పంపాల్సిన అవసరం థరూర్ కు ఎందుకొచ్చిందన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే థరూర్ ను కూడా పోలీసులు విచారించే అవకాశాలున్నాయి. విచారణలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, శశిథరూర్ ను ఖచ్చితంగా విచారించి తీరుతామని ఢిల్లీ పోలీసు కమిషనర్ బస్సీ పేర్కొన్నారు. మరోవైపు మీడియాలో ఓ వర్గం తనపై కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతుందని, రోజురోజుకీ దిగజారి తనపై లేనిపోని కథనాలు ప్రసారం చేస్తోందని కోల్ కతాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న శశిథరూర్ వ్యాఖ్యానించారు.