జాతి పిత మహత్మా గాంధీని నాథూరాం గాడ్సే కాల్చి చంపిన సంగతి తెలిసిందే. 1948 జనవరి 30న బిర్లా హౌస్ లో ప్రార్థన ముగించుకుని ప్రజల సందర్శనార్థం వస్తుండగా, ఎదురు పడి తన దగ్గరున్న తుపాకీతో కాల్చి చంపాడు గాడ్సే. అంతే హేరామ్ అంటూ అక్కడిక్కడే గాంధీ కుప్పకూలిపోయారు. అయితే ఆ తర్వాత అరెస్టయిన గాడ్సేకు ఉరిశిక్ష విధించారు. ఇంతకీ కాల్చిన తర్వాత పారిపోతున్న గాడ్సేను పట్టుకుంది ఎవరో తెలుసా? బిర్లా హౌస్ లో తొటమాలిగా పని చేస్తున్న రఘునాయక్. అభిమాన నేతను కాపాడుకోలేకపోయిన నాయక్ వెంటనే స్పందించి పారిపోతున్న గాడ్సేను వెంటపడి పట్టుకున్నాడంట. ఆ వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని గాడ్సేను అదుపులోకి తీసుకున్నారు.
ఒరిస్సాకు చెందిన నాయక్ తొలినాళ్ల నుంచే గాంధీ దగ్గర పని చేస్తూ ఉండేవాడు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొనటంతోపాటు బిర్లా హౌస్ లోనే తోటమాలిగా పని చేస్తూ, గాంధీకి సపర్యలు చేస్తూ ఉండేవాడు. ఇక చేతిలో గన్ను ఉన్నప్పటికీ లెక్క చేయకుండా ధైర్యం చేసి గాడ్సే ను వెంటాడి మరీ వీరోచితంగా పట్టుకున్న నాయక్ కు 500 రూపాయల ప్రైజ్ మనీ ఇచ్చారు నాటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్. 1983లో నాయక్ తుదిశ్వాస విచాడు. ఇక నాయక్ కు స్మరిస్తూ బుధవారం ఒడిషా ప్రభుత్వం 5 లక్షల రూపాయల చెక్కును నాయక్ కుటుంబానికి అందజేసింది. అన్నట్లు నాయక్ పేరు మీద స్వగ్రామం జాగులైపదలో స్మారక స్థూపం కూడా కట్టించారు ఆ ఊరి ప్రజలు.