దేశీయ విమానయాన సంస్థలు విదేశీ సర్వీసులు నడిపేందుకు అడ్డు పడుతున్న 5/20 నిబంధనపై రచ్చ కొనసాగుతూనే ఉంది. భారత విమానయాన రంగంలో అమలవుతున్న ఈ నిబంధనను తొలగించాలని టాటా గ్రూప్ సంస్థల గౌరవ చైర్మన్ రతన్ టాటా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే దీనిని విమానయాన సంస్థలు తప్పుపడుతున్నాయి. అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన వయసులో ఉన్న ఓ వ్యాపార దిగ్గజం జాతి ప్రయోజనాలు పక్కనబెట్టి, స్వప్రయోజనాల కోసం ఈ తరహా లేఖలు రాయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించాయి. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ లైన్స్ లో భాగంగా ఉన్న జెట్ ఎయిర్ వేస్, ఇండిగో, స్పైస్ జెట్, గో ఎయిర్ లు 5/20 నిబంధనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ రంగానికి దిగ్గజాలు రతన్ టాటా, అజయ్‌సింగ్ మాటల తూటాలు పేల్చుకున్నారు. విమానయానంపై గుత్తాధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు ఎంతో కాలంగా పాతుకుపోయిన విమానయాన సంస్థలు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నాయని రతన్ టాటా వ్యాఖ్యానించగా టాటాలు భాగస్వామిగా ఉన్న ఎయిర్ ఆసియా, విస్తారా ముందు సమర్థవంతంగా దేశీయ సర్వీసులు నడిపి ఆ తర్వాత విదేశీ సర్వీసులపై దృష్టి సారిస్తే మంచిదని స్పైస్‌జెట్ చీఫ్ అజయ్‌సింగ్ గట్టి సమాధానం ఇచ్చారు.
ఈ నిబంధన ప్రకారం దేశంలో విమాన సర్వీసులు నిర్వహిస్తున్న పౌరవిమానయాన సంస్థలు విదేశీ సర్వీసులు నిర్వహించాలంటే కనీసం ఐదేళ్ల పాటు దేశీయ సర్వీసులు నడిపిన అనుభవంతో పాటు 20 విమానాలు కలిగి ఉండాలన్నది 5/20 నిబంధన. అంటే రెండింటిలో గాని, ఏ ఒక్కదానిలో గాని అంతకన్నా తక్కువై ఉంటే ఆ సంస్థకు విదేశీ సర్వీసులు నడిపే అర్హత రాదు.