హ్యాపీ టూ బ్లీడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తోంది. మహిళలు సిగ్గు విడిచి నెలసరి బహిష్టుకు సంబంధించిన తమ తమ ఫోటోలతో అక్కడ రచ్చ రచ్చ చేస్తున్నారు. పైగా హ్యాపీ టూ బ్లీడ్ అన్న బోర్డులు చేతుల్లో పట్టుకుని మరి. అసలు ఇదంతా ఎందుకు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక కారణం శబరిమళై ప్రధాన పూజారి గోపాలకృష్ణన్ చేసిన వ్యాఖ్యలు. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమళ ప్రధాన పూజారిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన గోపాలక్రిష్ణన్ మహిళల నెలసరిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని పుట్టిస్తున్నాయి. మహిళలు బహిష్టు సమయంలో ఉన్నారో? లేరో? పరిశీలించే మెషీన్లను తీసుకువచ్చిన తరువాత, వారిని కూడా ఆలయంలోకి అనుమతించే నిర్ణయం తీసుకుంటామని ఆయన చేసిన వ్యాఖ్యలపై మహిళా లోకం భగ్గుమంది.
"ప్రస్తుతం సంవత్సరంలో కొద్ది రోజులు మాత్రమే మహిళలను అనుమతించడం లేదు. త్వరలోనే సంవత్సరమంతా మహిళల ప్రవేశాన్ని నిషేధించాలన్న రోజులు రావచ్చు. ప్రస్తుతం శరీరాల్లో దాచుకుంటున్న ఆయుధాలను గుర్తించే స్కానర్లు వచ్చాయి. ఏదో ఒకరోజు మహిళల శుభ్రతను గుర్తించే మెషీన్లూ వస్తాయి. అవి తెచ్చి పెట్టిన తరువాత, వారి ఆలయ ప్రవేశం గురించి ఆలోచిద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ బహిష్టు సమయానికి దగ్గరగా ఉన్న వారిని ఆలయంలోకి అనుమతించే ప్రశ్నే లేదు" అని ఆయన అన్నారు.
దీనికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో 'హ్యాపీ టూ బ్లీడ్' పేరిట ప్రచారం మొదలైంది. ఇందులో భాగంగా మహిళలు శబరిమల తంత్రి మాటలను వ్యతిరేకిస్తూ, చేతుల్లో ప్లకార్డులు, శానిటరీ నాప్కిన్స్, పోస్టర్లు పట్టుకుని తమ చిత్రాలను పోస్టు చేయాలని కోరగా, ఇప్పటికే 100 మంది మహిళలు తమ చిత్రాలను పోస్టు చేశారు. నెలసరి మహిళల శారీరక నిర్మాణంలో సహజంగా జరిగేదేనని, దీన్ని దాచుకోవాల్సిన అవసరం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. తంత్రి వ్యాఖ్యలు మహిళాలోకాన్ని అవమానపరిచేవిగా ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. అబ్బాయిలు కూడా ఈ ఆన్ లైన్ ఉద్యమానికి మద్ధతు ప్రకటిస్తూ చేతిలో బోర్డులతో ఫోటోలు షేర్ చేయటం ఇక్కడ విశేషం.