మైనర్ లు అన్న ఒకే ఒక్క సాకుతో వారు చేసే అకృత్యాలకు అంతులేకుండా పోతుంది. క్రైం రేటులో వారి పాత్ర నానాటికీ పెరిగిపోతుంది. ముఖ్యంగా మహిళలపై చేసేవి ఎక్కువగా ఉండటం శోచనీయం. తాజాగా ముంబైలో ఓ సీరియల్ నటిని లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటనలో ఓ మైనర్ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకెళితే... బుల్లి తెరపై స్థానం పదిలపరచుకుంటున్న ఓ చిన్న నటిపై దహిసర్ ప్రాంతానికి చెందిన ఓ పదహారేళ్ల బాలుడు వేధింపులకు పాల్పడ్డాడు. సదరు నటికి సంబంధించిన అశ్లీల ఫొటోలను చేజిక్కించుకున్న ఆ మైనర్, వాటిని ఆమె వాట్సప్ కే పంపి షాకిచ్చాడు.
ఆ ఫోటోలు మీడియాకు ఎక్కకుండా ఉండాలంటే తనకు రూ.5 లక్షలు ముట్టజెప్పాలని బ్లాక్ మెయిల్ కి దిగాడంట. దీంతో బెంబేలెత్తిపోయిన సదరు నటి, బంగౌర్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు సోమవారం ఉదయం ఆ మైనర్ బాలుడిని పట్టేశారు. విచారణలో భాగంగా ఆ నటిపై సాగించిన తీరులోనే మరో ముగ్గురు, నలుగురు నటీమణులను కూడా ఆ మైనర్ వేధించాడట. అయితే ఏ ఒక్కరి నుంచి కూడా అతడు డబ్బు వసూలు చేయకముందే పోలీసులకు పట్టుబడిపోయాడు. సదరు నటికి చెందిన ఈ-మెయిల్, ఇతర సోషల్ మీడియా సైట్ల నుంచే ఆ మైనర్ సదరు అశ్లీల ఫొటోలను దొరకబుచ్చుకున్నాడని చెప్పటంతో షాక్ తినటం పోలీసుల వంతు అయ్యింది.