అప్రమత్తతే పెనుముప్పు నుంచి కాపాడింది

January 03, 2015 | 10:56 AM | 43 Views
ప్రింట్ కామెంట్

ఓ వైపు దేశమంతా ప్రజలు నూతన సంవత్సర వేడుకల్లో మునిగి ఉండగా... చీకటి మాటున గుట్టు చప్పుడు కాకుండా పేలుడు సామాగ్రిని దేశంలోకి చేరవేసేందుకు ఉగ్ర వాదులు కుట్ర పన్నారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘటన ఈ అనుమానాలకు ఊతమిచ్చేలా ఉంది. నిఘా వ్యవస్థ సమాచారం ఆధారంగా కోస్ట్ గార్డ్ షిప్, యుద్ధవిమానం సమన్వయంతో భారీ విధ్వంసాన్ని అడ్డుకోగలిగారు. గుజరాత్ లోని పోర్ బందర్ పోర్టుకు 350 కిమీ లలో అనుమానాస్పదంగా భారత్ వైపు వస్తున్న ఓ పడవను గమనించిన భద్రతా సిబ్బంది జాగ్రత్త పడ్డారు. ‘బోట్ డెక్‌పై నలుగురు వ్యక్తులు కనిపించారు. బోట్‌ను ఆపేయాల్సిందిగా భారత కోస్టల్ గార్డు చేసిన హెచ్చరికలను విని అనంతరం లోపలికి వెళ్లి వారు ఆ పడవను పేల్చేశారు. బాగా చీకటి, బలమైన గాలులు, ప్రతికూల వాతావరణం ఉండటంతో ఆ పడవను స్వాధీనం చేసుకోలేకపోయాం. అలాగే, అందులోని వారిని ప్రాణాలతో పట్టుకోలేకపోయాం’ అని ఆ ప్రకటనలో రక్షణ శాఖ తెలిపింది. అయితే పడవలో నుంచి ఎవరైనా తప్పించుకున్నారా? అనే కోణంలో ఆ ప్రాంతంలో క్షుణ్ణంగా గాలింపు జరుపుతున్నాయని వెల్లడించింది. కరాచీ కేతీబందర్ కు చెందిన ఆ పడవలోని సిబ్బంది తమను తాము పేల్చేసుకోవడం... ఆ పడవలో పేలుడు పదార్థాలున్నాయన్న విషయాన్ని నిర్ధారిస్తుందని తీరరక్షక దళ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ కేఆర్ నౌతియాల్ వ్యాఖ్యానించారు. ఇక ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నవారిని రక్షణ శాఖా మంత్రి మనోహర్ పారికర్ ప్రశంసించారు. భారత్‌లో ఉగ్ర దాడులకు పాక్ సహకరిస్తోందనేందుకు ఇది తాజా ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు. సాయుధ దళాలకు మరిన్ని అధికారాలు ఇచ్చినందువల్లనే... ఆదేశాల కోసం కేంద్రం వైపు చూడకుండా సమయానికి స్పందించాయని పేర్కొన్నారు. మొత్తం మీద మరో భారీ ఉపద్రవాన్ని తీర రక్షక దళం విజయవంతంగా అడ్డుకుంది. లేకుంటే ఉగ్ర రాక్షసులు 26/11 ముంబై తరహా దాడులతో మరిన్ని నరమేధాలు స్రుష్టించి ఉండేవారేమో.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ