చనిపోయారనుకున్న వ్యక్తులు లేచి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన ఘటనలు ఎన్నో జరిగాయి. అయితే ఇక్కడా అలాంటి ఓ ఘటన జరిగింది. కానీ, చివరికి విషాదం తప్పలేదు. ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ ప్రాంతంలో జరిగిందీ ఘటన. 65 ఏళ్ల గోమతి అనే మహిళ బుధవారం చనిపోయింది. ఆమె లేదన్న విషయం తెలుసుకున్న ఎక్కడెక్కడి బంధువులో అంతా అక్కడికి వచ్చి చేరారు. చివరి కార్యక్రమానికి ఏర్పాట్లు కూడా చకచకా పూర్తి చేశారు. ఇంతలో ఆమె నేను బతికే ఉన్నాను. నేను బతికే ఉన్నాను అని అరవడం ప్రారంభించింది. దీంతో ఆమె బంధువులంతా ఆమెకు చుట్టిన వస్త్రాలను తీసేశారు. గట్టిగా ఓసారి ఊపిరి పీల్చుకున్న గోమతి ముందు మంచినీళ్లు తాగింది. అనంతరం వారితో సరదాగా మాట్లాడింది. చనిపోయిందనుకున్న ఆమె తిరిగి బతకటంతో వారంతా సంతోషం వ్యక్తంచేశారు. అయితే ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఓ గంట తర్వాత గోమతి మళ్లీ చనిపోయింది. మళ్లీ కళ్లు తెరుస్తుందేమో అని ఆశించిన ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర నిరాశలో క్రుంగిపోయారు.