మోస్ట్ వాంటెడ్ డాన్ చోటారాజన్ అరెస్ట్

October 26, 2015 | 03:54 PM | 2 Views
ప్రింట్ కామెంట్
chhota_rajan_arrested_in_baali_niharonline

రెండు దశాబ్దాలుగా చిక్కని మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ చోటారాజన్ ఎట్టకేలకు అరెస్టయ్యాడు. ఇండోనేషియాలోని బాలిలో అతడిని ఇంటర్ పోల్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్ట్రేలియా పోలీసులు అందించిన సమాచారం మేరకు ఇంటర్ పోల్ వర్గాలు బాలిలో అరెస్టు చేశాయి. 55 ఏళ్ల రాజన్ 1995 నుంచి పరారీలో ఉన్నాడు. ఇప్పటికీ ముంబైలో జరుగుతున్న పలు ఘటనలలో అతని హస్తం ఉందని చెబుతుంటారు. ఒకప్పుడు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సన్నిహిత సహచరుడైన రాజన్... తరువాత అతనికే గట్టి ప్రత్యర్థిగా మారాడు. ముంబై పోలీసులు, భారత నిఘా ఏజెన్సీలు దాదాపు రెండు దశాబ్దాల నుంచి అతని కోసం వెతుకుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఆస్ట్రేలియా పోలీసులు ఇచ్చిన సమాచారంతో చోటా రాజన్ ను పట్టుకున్నారు.

"ఆస్ట్రేలియా పోలీసు అధికారులు ఇచ్చిన సమాచారంతో మేము ఓ వ్యక్తిని అరెస్టు చేశాం. ఇండియాలో జరిగిన 20 హత్యలతో ఇతనికి సంబంధముందని, 1995 నుంచి ఇంటర్ పోల్ వెతుకుతోందని తెలిసి ఆశ్చర్యపోయాం. ఇతని పేరు రాజేంద్ర సదాశివ్ నికల్జీ" అని భారత పోలీసు అధికారులకు ఇండోనేషియా నుంచి సమాచారం అందగానే, ముంబై పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాజేంద్ర సదాశివ్ నికల్జీ పేరు వినగానే, అతను మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఒకప్పటి ప్రధాన అనుచరుడు చోటా రాజన్ గా అనుమానించారు. ఆ వెంటనే పట్టుబడింది చోటా రాజన్ అని ఖరారు చేసుకున్నారు.

55 ఏళ్ల రాజన్ దాదాపు 20 సంవత్సరాలుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఆస్ట్రేలియా నుంచి ఇండోనేషియాకు విమానంలో వచ్చిన అతనిని ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. కాగా, దావూద్ ఇబ్రహీం నుంచి రాజన్ విడిపోయి మరో వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న తరువాత ఇరు వర్గాల మధ్య చాలా గొడవలు నడిచాయి. ఆ నేపథ్యంలోనే దావూద్ గ్యాంగ్ సభ్యుడొకడు చోటా రాజన్‌ కు సంబంధించిన సమాచారం ఆస్ట్రేలియన్ పోలీసులకు అందించి ఉండవచ్చని భావిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా చోటా రాజన్ ను ఇండియాకు అప్పగించే అవకాశాలున్నాయని ఇంటర్ పోల్ అధికారులు వెల్లడించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ